టెకీలకు తీపికబురు

2 Nov, 2017 18:58 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఐటీ రంగంలో కొలువులపై కత్తి వేలాడుతున్న క్రమంలో టెకీలకు ఉపశమనం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది దాదాపు 1000కిపైగా స్టార్టప్‌లు టెక్నాలజీ రంగంలో ప్రారంభమయ్యాయని నాస్కామ్‌ స్టార్టప్‌ నివేదిక వెల్లడించింది. ఆటోమేషన్‌ రాకతో వేలాది ఉద్యోగాలు ఊడుతున్న నేపథ్యంలో భారత్‌ ప్రపంచంలోనే మూడద అతిపెద్ద స్టార్టప్‌ హబ్‌గా బలపడటం టెకీలకు ఊరట ఇస్తోంది. కొత్త యూనిట్లను కలుపుకుంటే దేశంలో టెక్నాలజీ స్టార్టప్‌ల సంఖ్య 5200కు చేరుకుందని ఈ నివేదిక వెల్లడించింది.

15,000 కోట్ల డాలర్లతో అతిపెద్ద ఉపాధి రంగంగా ఉన్న భారత ఐటీ రంగం ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ వంటి నూతన టెక్నాలజీల రాకతో నియామకాల ప్ర్రక్రియలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. నూతన టెక్నాలజీలతో పెద్ద ఎత్తున ఈ రంగంలో ఉద్యోగాలకు కోతపడుతున్నది.

ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహింద్రాల్లో సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గింది.ఇక స్టార్టప్‌ల హవా పెరగడం, అమెరికాలో ఐటీ వ్యయాలు క్రమంగా పుంజుకోనుండటంతో టెకీల నియామకం క్రమంగా ఊపందుకుంటుందని నాస్కామ్‌ అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు