వన్‌ప్లస్‌ 6ను లీక్‌ చేసిన అమితాబ్‌

8 May, 2018 12:20 IST|Sakshi
వన్‌ప్లస్‌ 6 మోడల్స్‌తో పీటే లా, అమితాబ్‌ (ట్విటర్‌లో షేర్‌ చేసిన ఇమేజ్‌)

గత కొన్నేళ్లుగా వన్‌ప్లస్‌ కంపెనీకి, బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. వన్‌ప్లస్‌ తన బ్రాండుకు అమితాబ్‌ బచ్చన్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా నియమించుకుంది. గతేడాది వన్‌ప్లస్‌ 5ను లాంచ్‌ ఈవెంట్‌లో అమితాబ్‌ అలరించారు కూడా. తాజాగా వన్‌ప్లస్‌ కంపెనీ మరో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను మరికొన్ని రోజుల్లో మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ఆ డివైజ్‌పై పలు లీక్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేశాయి.

తాజాగా అమితాబ్‌ బచ్చనే కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇమేజ్‌ను తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేసి, వెంటనే డిలీట్‌ చేశారు. అమితాబ్‌ బచ్చన్‌, కంపెనీ వ్యవస్థాపకుడు సీఈవో పీటే లా ఇద్దరూ కలిసి తెలుపు, నలుపు రంగుల్లో ఉన్న రెండు మోడల్స్‌ను చేతిలో పట్టుకుని ఉన్న ఇమేజ్‌ను పోస్టు చేశారు. వెంటనే ఈ పోస్టును అమితాబ్‌ డిలీట్‌ చేసేశారు. అయినప్పటికీ సెకన్ల వ్యవధిలోనే ఆ ఇమేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ అయిపోయింది. అమితాబ్‌ వెంటనే ఆ పోస్టు డిలీట్‌ చేయడంతో, వన్‌ప్లస్‌ తర్వాత తీసుకురాబోతున్న వన్‌ప్లస్‌ 6 డివైజ్‌ అదేనని స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్టు అయింది. 

ఈ ఫోన్‌ అచ్చం ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి డిజైన్‌లో మార్కెట్‌లోకి వస్తుందని ఈ ఇమేజ్‌ను బట్టి అర్థమవుతోంది. మెరిసే బాడీ, వెనుక వైపు రెండు కెమెరాలతో రూపొందినట్టు తెలుస్తోంది. వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌  కూడా ఉన్నట్టు ఆ ఇమేజ్‌ చూపిస్తోంది. మొత్తంగా నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న ఈ డివైజ్‌ చూడటానికి చూడముచ్చటగా ఉన్నట్టు టెక్‌ వర్గాలంటున్నాయి. వన్‌ప్లస్‌ 6 డివైజ్‌ ట్వీట్‌ను తొలగించిన అమితాబ్‌, వెంటనే పీటే లాతో దిగిన సెల్ఫీని పోస్టు చేశారు. మే 17న భారత్‌లో వన్‌ప్లస్‌ నిర్వహించబోతున్న వన్‌ప్లస్‌ 6 లాంచింగ్‌ ఈవెంట్‌కు హాజరవుతున్నట్టు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్‌ మే 16న మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. ఒక్కరోజు అనంతరం ముంబైలో ఈ ఫోన్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరుగుతోంది. వన్‌ప్లస్‌ నుంచి ఎంతో కాలంగా వేచిచూస్తున్న డివైజ్‌ వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌పై పలు లీక్‌లు మార్కెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కంపెనీ సైతం పలు బ్లాగ్‌ పోస్టులు, సోషల్‌ మీడియా ట్వీట్లు, ఫేస్‌బుక్‌ పోస్టుల ద్వారా ఈ డివైజ్‌కు సంబంధించి చాలా ఫీచర్లను రివీల్‌ చేసేసింది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ఎస్‌ఓసీ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్లు, డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ కోసం ఐపీ67 లేదా ఐపీ68 సర్టిఫికేషన్‌ను ఇది కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు