రూ.2.5 లక్షల కోట్ల ఎన్‌పీఏలు ఏఆర్‌సీల చేతికి

3 May, 2017 01:22 IST|Sakshi
రూ.2.5 లక్షల కోట్ల ఎన్‌పీఏలు ఏఆర్‌సీల చేతికి

న్యూఢిల్లీ: అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీల(ఏఆర్‌సీ)  కు బ్యాంకులు 2003 నుంచి విక్రయించిన మొండిబకాయిల విలువ రూ.2.44 లక్షల కోట్లు. 23 ఏఆర్‌సీలకు సంబంధించి ఎస్‌ఐపీఐ–ఎడిల్‌వీజ్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన అసోచామ్‌ సర్వే ఒకటి ఈ విషయాన్ని తెలిపింది. ఎన్‌పీఏల కొనుగోళ్ల విషయమై భవిష్యత్తులో కూడా ఏఆర్‌సీలకు మంచి అవకాశాలు ఉంటాయని అసోచామ్‌ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15 శాతం రుణాలు (9.84 శాతం మొండిబకాయిలు, 4.2 శాతం పునర్‌వ్యవస్థీకరణ రుణాలు) ఆందోళనకర రీతిలో ఉన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. ‘భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఒత్తిడిలో ఉన్న రుణ విలువ దాదాపు రూ.11.80 లక్షల కోట్లు. బ్యాంకింగ్‌కు ఉన్న బకాయిలు.. మొండిబకాయిలుగా మారిన కంపెనీల ప్రమోటర్లతో కఠినంగా వ్యవహరించడానికి ఏఆర్‌సీలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలి’ అని నివేదిక ఈ సందర్భంగా సూచించింది.

కొత్త విభాగాల్లోకి మోడర్న్‌ పుడ్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్రెడ్‌ ఉత్పత్తుల తయారీ కంపెనీ మోడర్న్‌ ఫుడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కొత్త విభాగాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. కేక్స్, మఫిన్స్‌ వంటి ఉత్పాదనలను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ సీఈవో అసీమ్‌ సోనీ తెలిపారు. కొత్త ప్యాకింగ్‌తో ప్రొడక్టులను ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యానికి మేలు చేసే బ్రెడ్‌ రకాలను పరిచయం చేస్తామన్నారు. ‘టర్నోవరులో బ్రెడ్‌యేతర ఉత్పత్తుల వాటా ప్రస్తుతం 5 శాతం మాత్రమే. నాలుగేళ్లలో దీనిని మూడింట ఒక వంతు శాతానికి చేరుస్తాం. 2016–17లో కంపెనీ ఆదాయం రూ.270 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. భారత బ్రెడ్‌ ఉత్పత్తుల మార్కెట్‌ 2–4 శాతం వృద్ధితో రూ.6,000 కోట్లుంది. హెల్త్, వెల్‌నెస్‌ విభాగం రెండంకెల వృద్ధి నమోదు చేస్తోంది’ అని వివరించారు.

మరిన్ని వార్తలు