బడ్జెట్‌ అంచనాలు, క్యూ3 ఫలితాలు కీలకం

20 Jan, 2020 03:50 IST|Sakshi

ఆల్‌టైమ్‌ హైల వద్ద సెన్సెక్స్, నిఫ్టీలు

ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఎనలిస్ట్‌ల సూచన

కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నాయి. వీటితో పాటు కేంద్ర బడ్జెట్‌పై పెరుగుతున్న అంచనాలు స్టాక్‌ మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, డాలర్‌తో రూపాయి మారకం విలువ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు. అంతర్జాతీయ అంశాల కన్నా కంపెనీల క్యూ3 ఫలితాలు, రానున్న బడ్జెట్‌పైననే మార్కెట్‌ దృష్టి ప్రధానంగా ఉంటుందని నిపుణుల ఉవాచ.

ఫలితాల ప్రభావం..... 
శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీలు, శనివారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు తమ తమ క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డ్‌ స్థాయి లాభాన్ని సాధించగా, టీసీఎస్‌ ఫలితాలు అంచనాలను తప్పాయి. సోమవారం మార్కెట్‌పై ఈ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రభావం ఉంటుంది. ఇక ఈ వారంలో ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, బయోకాన్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్,  యాక్సిస్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలతో సహా దాదాపు వందకు పైగా కంపెనీలు తమ ఫలితాలను వెల్లడిస్తాయి.  టెలికం కంపెనీలు ఏజీఆర్‌(సవరించిన స్థూల రాబడి) బకాయిల చెల్లింపునకు గడువు ఈ నెల 23 (గురువారం) కావడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించవచ్చు.

అప్రమత్తత తప్పనిసరి... 
సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ సిద్ధార్థ ఖేమ్కా సూచించారు. క్యూ3 ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ కదలికలు కీలకమని పేర్కొన్నారు. బడ్జెట్‌ అంచనాల కారణంగా వివిధ రంగ షేర్లపై ప్రభావం ఉంటుందని వివరించారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు ః రూ.1,288 కోట్లు...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ నెల 17 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లో రూ.10,200 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.8,912 కోట్లు వెనక్కి తీసుకున్నారు. నికరంగా మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ.1,288 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు