ప్రపంచ పరిణామాలే కీలకం!

27 Aug, 2018 01:37 IST|Sakshi

ఆగస్ట్‌ సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఈ వారమే  

అందుకే ఒడిదుడుకులు ఉండొచ్చు  

జీడీపీ గణాంకాలూ ముఖ్యమే..

అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ ప్రభావమూ ఉంటుంది  

అమెరికా అధ్యక్షుడి అభిశంసన భయాలు  

ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకులు..

అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌ జీడీపీ గణాంకాలు,  రూపాయి కదలికలు  కూడా కీలకమేనని వారంటున్నారు. మరోవైపు ఆగస్టు సిరీస్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ఈ గురువారం (ఈ నెల 30) ముగియనుండటంతో స్టాక్‌ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.  

శుక్రవారం జీడీపీ గణాంకాలు...
ఈ నెల 31న(శుక్రవారం) ఈ ఏడాది జూన్‌ క్వార్టర్‌(క్యూ2) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు వెల్లడవుతాయి. ఈ క్యూ1లో 7.7 శాతం వృద్ధి నమోదైంది. ఈ క్యూ2లో 7.6 శాతం వృద్ది నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే రోజు జూలై నెలకు సంబంధించిన వాణిజ్య లోటు గణాంకాలు వస్తాయి. మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలు కూడా అదే రోజు వెలువడతాయి.

ఈ నెల 24తో ముగిసిన వారానికి సంబంధించిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఈ నెల 17తో ముగిసిన వారానికి సంబంధించిన బ్యాంక్‌ డిపాజిట్లు, రుణాల వృద్ధి గణాంకాలు కూడా శుక్రవారం రోజే వస్తాయి. కాగా అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింతగా ముదిరాయి. ఇరు దేశాలు 1,600 కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై 25 శాతం చొప్పున సుంకాలు విధించాయి. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ కోసం ఉద్దేశించిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి.  

జీడీపీ గణాంకాలు కీలకం...
సమీప భవిష్యత్తులో జీడీపీ గణాంకాలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని ఈక్విటీ 99 సీనియర్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ రాహుల్‌ శర్మ పేర్కొన్నారు. ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్‌ఓవర్‌ చేస్తారని, దీంతో మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ పేర్కొన్నారు. 

అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపరుస్తోందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మాంగ్లిక్‌ చెప్పారు. తనను తొలగిస్తే(అభిశంసన) మార్కెట్‌ భారీగా పతనమవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించడం వల్ల కూడా సెంటిమెంట్‌ దెబ్బతింటోందని వివరించారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ నిజంగా అభిశంసనకు గురైతే, ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమవుతాయని ఈక్విటీ 99 ఎనలిస్ట్‌ శర్మ అంచనా వేస్తున్నారు.


మళ్లీ విదేశీ నిధుల వరద
విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈ నెలలో కొనసాగుతోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)ఈ నెలలో ఇప్పటివరకూ మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ.6,700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్‌ మార్కెట్లో రూ.2,048 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.4,662 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశారు. స్థూల ఆర్థికాంశాలు మెరుగుపడటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం దీనికి ప్రధాన కారణాలు. కాగా గత నెలలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ.2,300 కోట్ల మేర మాత్రమే ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు