ఈ ఏడాది ఐటీ వృద్ధి10-12 శాతంగానే..

21 Jul, 2016 01:17 IST|Sakshi
ఈ ఏడాది ఐటీ వృద్ధి10-12 శాతంగానే..

మా అంచనాలు పరిశ్రమ మొత్తానికి వర్తిస్తాయి
ఏదో ఒకటి రెండు కంపెనీలవి కాదు: నాస్కామ్

 న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు జూన్ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగ వృద్ధి మాత్రం అంచనాలకు తగ్గట్టు 10-12 శాతంగానే ఉంటుందని నాస్కామ్ అభిప్రాయపడింది. అంచనాలను తగ్గించేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. జూన్ త్రైమాసికంలో ప్రముఖ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం, భవిష్యత్తు ఆదాయాలపై కూడా పెద్దగా ఆశాభావం వ్యక్తం చేయకపోవడం తెలిసిందే. విప్రో నికర లాభం ఏకంగా 6 శాతం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశంపై ఆయన పీటీఐతో మాట్లాడుతూ... ‘‘ఇప్పటి వరకైతే వృద్ధిలో ఎలాంటి క్షీణతా లేదు. పరిశ్రమలోని అన్ని విభాగాల్లో, సేవల్లో ఈ వృద్ధి ఏకరీతిన చక్కగా కొనసాగుతోంది’’ అన్నారాయన. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బీపీవో ఎగుమతులు 10 నుంచి 12% వృద్ధి చెందుతాయని నాస్కామ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేయటం తెలిసిందే. అయితే తమ అంచనాలు ఐటీ రంగం మొత్తానికి సంబంధించి నవి, ఏవో కొన్ని పెద్ద కంపెనీలకు మాత్రమే పరి మితం కాదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మార్జిన్లపై ఒత్తిడి ఉన్నప్పటికీ ఆదాయాల్లో మంచి వృద్ధి నమోదవుతుందన్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక సమస్యలు నెలకొని ఉన్నా ఐటీ రంగంలో బలమైన గిరాకీ ఉందని, ఈ రంగంలో పెట్టుబడులు కూడా తగ్గబోవని ఆయన స్పష్టంచేశారు. అంతర్జాతీయంగా భారత ఐటీ రంగం వాటా కూడా పెరుగుతోందని ఆయన చెప్పారు.

Election 2024

మరిన్ని వార్తలు