16 బిలియన్ డాలర్లకు అనలిటిక్స్ పరిశ్రమ: నాస్కామ్

24 Jun, 2016 00:51 IST|Sakshi
16 బిలియన్ డాలర్లకు అనలిటిక్స్ పరిశ్రమ: నాస్కామ్

హైదరాబాద్: దేశీ అనలిటిక్స్ పరిశ్రమ 2025 నాటికి 16 బిలియన్ డాలర్లకి చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఇది 2 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌లో 600కు పైగా అనలిటిక్స్ సంస్థలు (వీటిలో 400 వరకు స్టార్టప్స్ ఉన్నాయి) ఉన్నాయని, దేశాన్ని అనలిటిక్స్ సొల్యూషన్స్‌కు సంబంధించి గ్లోబల్ హబ్‌గా మార్చే సత్తా వీటికి ఉందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. ఆయన ‘బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ సమిట్ 2016’ నాల్గవ ఎడిషన్ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడారు.

అంతర్జాతీయంగా అనలిటి క్స్ సొల్యూషన్స్‌ను అందించే టాప్-10 దేశాల్లో భారత్ ఒకటన్నారు. 2025 నాటికి ఇండియా టాప్-3లోకి చేరాలనేది తమ కోరికని తెలిపారు. అనలిటిక్స్ పరిశ్రమ వృద్ధితో దేశంలో ఉపాధి కూడా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం 90,000ల మంది అనలిటిక్స్ ప్రొఫెషనల్స్ హెచ్‌ఆర్, మార్కెటింగ్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి విభాగాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వృద్ధి అంచనాలను పరిశీలిస్తే.. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ హబ్‌గా అవతరించనుందని నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

 ఐటీ ఇంజినీర్ల కన్నా అధిక సంపాదన..
దేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కన్నా డేటా అనలిస్ట్‌లే ఎక్కువ సంపాదిస్తున్నారు. డిమాండ్-సప్లై మధ్య అంతరం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని కోక్యూబ్స్ టెక్నాలజీస్ తన నివేదికలో తెలిపింది. ప్రారంభ స్థాయిలో సగటున డేటా అనలిస్ట్‌ల వార్షిక వేతనం రూ.7 లక్షలుగా ఉంటే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల జీతం రూ.3.2 లక్షలుగా ఉందని పేర్కొంది.

మరిన్ని వార్తలు