కంగ్రాట్స్‌..రాకేశ్‌, భూపేశ్‌ : ఆనంద్‌ మహీంద్ర

19 Sep, 2019 11:29 IST|Sakshi

ఇద్దరు విజేతలకు వాహనాలు ఇవ్వనున్న ఆనంద్‌ మహీంద్ర

తాను నిర్వహించిన ఫొటో క్యాప్షన్‌ పోటీలో ఇద్దరు వ్యక్తులు గెలుపొందినట్లు పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర ప్రకటించారు. ఈ మేరకు వారిద్దరికి డై కాస్ట్‌ మహీంద్రా మోడల్‌ వాహనాన్ని బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూ.. వారి చిరునామా తెలపాల్సిందిగా కోరారు. మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. పలు సామాజిక అంశాలపై స్పందించే మహీంద్ర తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ బస్సు ఫొటోను షేర్‌ చేసిన ఆనంద్ మహీంద్ర.. దానికి సరిగా సరిపోయే క్యాప్షన్‌ జతచేసిన వారికి డై కాస్ట్‌ మోడల్ మహీంద్రా (బొమ్మ కారు)ను ఇస్తానని ప్రకటించారు. హిందీ, ఇంగ్లీష్‌ లేదా హింగ్లీష్‌ భాషలో క్యాప్షన్‌ ఉండాలని షరతు పెట్టారు. ఈ పోటీకి సై అన్న ఔత్సాహిక నెటిజన్లు తమ సృజనాత్మతకు పదును పెట్టి క్యాప్షన్లతో ఆనంద్‌ మహీంద్రాకు బదులిచ్చారు.(చదవండి : మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్రా!)

ఈ క్రమంలో బస్సు క్యాప్షన్ పోటీలో రాకేశ్‌, భూపేశ్‌ అనే ఇద్దరు వ్యక్తులను ఆనంద్‌ మహీంద్ర గురువారం విజేతలుగా ప్రకటించారు. ఈ మేరకు...‘ కాప్షన్‌ పోటీలో ఇద్దరు గెలుపొందారు. ఒకటి హిందీ/హింగ్లీష్‌, ఇంకోటి ఇంగ్లీష్ టైటిల్. రెండూ తెలివైన సమాధానాలు. కంగ్రాట్స్‌ రాకేశ్‌. మీరు ఇచ్చిన క్యాప్షన్‌ బాగుంది. మహీంద్రాకేర్స్‌ డీఎంకు మీ చిరునామా పంపండి అని ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. అదే విధంగా మరో విజేత భూపేశ్‌ను కూడా తన చిరునామా షేర్‌ చేయాల్సిందిగా కోరారు. ఇంతకీ వారిద్దరూ ఏ క్యాప్షన్లు చెప్పి మహీంద్రా వాహనాలు సొంతం చేసుకున్నారా అని ఆలోచిస్తున్నారా..అక్కడికే వస్తున్నాం.. కాస్త ఆగండి.. బస్సుపై తిరగేసిన బస్సు ఉన్నట్లుగా ఆ ఫొటోకు రాకేశ్‌ సబ్‌ కీ బస్(SUB की BUS)‌, భూపేశ్‌ హ్యాంగోవర్ బస్‌‌(Hangover Bus) అనే క్యాప్షన్లు ఇచ్చారు. కాగా ఆనంద్‌ మహీంద్రా చొరవతో తమిళనాడుకు చెందిన ఇడ్లీ అవ్వ కమలాతాళ్‌కు భారత్‌ గ్యాస్‌ ఇటీవలే గ్యాస్‌ స్టవ్‌ అందించిన విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా