చెప్పుల డాక్టర్‌ : ఐఐఎమ్‌ ప్రొఫెసర్‌..?

18 Apr, 2018 18:27 IST|Sakshi

ముంబై : వ్యాపారవేత్త​ ఆనంద్‌ మహీంద్ర ప్రతిభను ప్రోత్సహించడాన్ని బాగా ఆస్వాదిస్తారు. సృజనాత్మకత ఎక్కడ ఉన్నా స్వాగతిస్తారు ఈ బిజినెస్‌ టైకూన్‌. ప్రస్తుతం ఆనంద్‌ మహీంద్ర తన ట్విటర్‌లో పోస్టు చేసిన ఒక ఫోటో ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సారి ఈ వ్యాపార వేత్త ఒక ‘చెప్పుల డాక్టర్‌’ ఫోటోను పోస్టు చేశారు. ఇప్పుడు ఈ పోస్టుకు తెగ పొగడ్తలు లభిస్తున్నాయి. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే 8,200లైకులను, 1,900 రీట్విట్లను అందుకుంది. ఈ ఫోటో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి షాపుకు సంబంధించినది. నర్సిరాం అనే వ్యక్తి తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి దుకాణం ముందు ఒక ప్రకటన ఫ్లెక్సిని ఏర్పాటు చేశాడు. ఈ ప్రకటనలో ​‘దెబ్బతిన్న చెప్పుల ఆస్పత్రి, డా. నర్సిరాం, రోగులకు అందుబాటులో ఉండు సమయం’ వంటి వివరాలు ఉన్నాయి.

ఈ ప్రకటన ఆనంద్‌ మహీంద్రను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక్కడ రోగులు అంటే దెబ్బతిన్న చెప్పులు, డాక్టర్‌ అంటే చెప్పులు కుట్టే నర్సిరాం, దుకాణం తెరిచి ఉంచే సమయమే రోగులను అనుమతించే సమయం అని అర్థం. ఈ ఫోటోతో పాటు ఆనంద్‌ మహీంద్ర ఈ చెప్పులు కుట్టుకునే వ్యక్తికి మంచి మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నాయి. అవకాశం వస్తే ఇతను ఐఐఎమ్‌లో మార్కెటింగ్‌ పాఠాలు చెప్పేస్థాయిలో ఉండేవాడని మెసేజ్‌ చేశాడు.తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇతను ఇంత మంచి మార్గాన్ని ఎన్నుకున్నాడని అభినందించడమే కాక ఈ ‘చెప్పుల డాక్టర్‌’ పూర్తి వివరాలు ఇస్తే తాను పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.  ఓర్పు, చిరునవ్వుతో చేసే పని ఎంత చిన్నదయినా దానికి మంచి ఫలితం లభిస్తుందని అన్నారు.

మరిన్ని వార్తలు