ఎట్టకేలకు ఆనంద్ మహీంద్రా సాధించారు

10 Jun, 2020 14:51 IST|Sakshi
ఆనంద్ మహీంద్రా (ఫైల్ ఫోటో)

 స్టార్టప్ లో  భారీ పెట్టుబడులు

సాక్షి, ముంబై : ప్రమఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గత రెండేళ్లుగా వెతుకుతున్న స్టార్టప్‌ను ఎట్టకేలకు  కనుగొన్నారు.  గురుగ్రామ్ కు చెందిన హ్యాప్ రాంప్ స్టార్టప్ లో 1 మిలియన్ (సుమారు  రూ. 7.5 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆనందర్ మహీంద్ర ట్విటర్ ద్వారా ప్రకటించారు.

తాను పెట్టుబడులు పెట్టేందుకు గత రెండు సంవత్సరాలుగా వెతుకుతున్న స్టార్టప్ ను గుర్తించినట్టు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఐదుగురు యువ వ్యవస్థాపకులు నెలకొల్పిన హ్యాప్ రాంప్ సృజనాత్మకత, సాంకేతికత, డేటా రక్షణ మేలు కలయిక అని ఆయన పేర్కొన్నారు. వారి సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం గోసోషల్ యాప్ ను పరిశీలించాలని కోరారు. బ్లాక్ చెయిన్,సోషల్ మీడియా వంటి సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేసే స్టార్టప్ ఇది. ఈ కంపెనీని  ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-వడోదరకు చెందిన ఐదుగురు విద్యార్థులు 2018 లో స్థాపించారు. ఈ సంస్థలో దేశవ్యాప్తంగా 12 మంది ఉద్యోగులున్నారు

హ్యాప్ ర్యాంప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శుభేంద్ర విక్రమ్ దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. తమ గోసోషల్ గురించి మాట్లాడుతూ మూడు నెలల్లోపు 50వేల వినియోగదారులను సంపాదించామన్నారు. దేశంలో రాబోయే మూడు నెలల్లో లక్ష మంది, ఈ సంవత్సరం చివరి నాటికి 10 లక్షల వినియోగదారులను  సొంతంచేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే ఉద్యోగుల సంఖ్యను 25-30 పెంచుకుంటామని తెలిపారు. ఈ  యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉండగా,  త్వరలో ఆపిల్ యాప్ స్టోర్‌లో కూడా లాంచ్ చేస్తామని చెప్పారు. ఫోటోగ్రాఫర్‌లు, కళాకారులు, రచయితలు, డిజైనర్లు రూపొందించిన సృజనాత్మక  సవాళ్ళను స్వీకరించడంతో పాటు యూజర్లు  బహుమతులు గెల్చుకోవచ్చని విక్రమ్ వివరించారు.

కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న భారతీయ సోషల్ మీడియా స్టార్టప్ లో పెట్టుబడుల ప్రణాళికలను ట్విట్టర్ ద్వారా 2018లో మహీంద్రా ప్రకటించారు. నెక్స్ట్-జెనరేషన్ భారతీయ సోషల్ మీడియా స్టార్ట్-అప్‌ను కనుగొనడానికి తనతో కలిసి పనిచేయాలని మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ జస్‌ప్రీత్ బింద్రాను ఆనంద్ మహీంద్ర కోరిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు