ఆనంద్‌ మహీంద్రా, గుర్నానీ క్షమాపణలు

8 Jul, 2017 01:08 IST|Sakshi
ఆనంద్‌ మహీంద్రా, గుర్నానీ క్షమాపణలు

టెక్‌ మహీంద్రాలో ఉద్యోగి తొలగింపు ఘటనపై స్పందన
న్యూఢిల్లీ: ఏదైనా ఒక కార్పొరేట్‌ సంస్థ వ్యవస్థాపకులు ఉద్యోగికి బహిరంగంగా క్షమాపణలు తెలియజేయడం చాలా చాలా అరుదు. ఇలాంటి ఘటనే ఒకటి టెక్‌ మహీంద్రా కంపెనీలో చోటుచేసుకుంది. సాక్షాత్తు మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా.. ఉద్యోగికి ట్వీటర్‌ వేదికగా క్షమాపణలు తెలియజేశారు. ఈయనతోపాటు సంస్థ సీఈవో కూడా ఉద్యోగికి క్షమాపణలు చెప్పారు.

వీరు ఎందుకు క్షమాపణలు తెలిపారో చూద్దాం..  
టెక్‌ మహీంద్రాలోని హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు అదే కంపెనీలోని ఉద్యోగిని రాజీనామా చేయాలని కోరారు. కంపెనీ నిర్ణయం మేరకు రేపు ఉదయానికంతా రిజైన్‌ పేపర్లు టేబుల్‌ మీద ఉండాలని ఆదేశించారు. ఈ విషయానికి సంబంధించిన ఆడియో క్లిప్‌ ఒకటి ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆనంద్‌ మహీంద్రా.. ‘నేను వ్యక్తిగతంగా క్షమాపణలు తెలియజేస్తున్నా. వ్యక్తి గౌరవాన్ని కాపాడటమనేది సంస్థ విలువల్లో ప్రధానమైనది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం’ అని ట్వీట్‌ చేశారు. ‘ఉద్యోగి, హెచ్‌ఆర్‌ ప్రతినిధి మధ్య జరిగిన సంభాషణ తమ దృష్టికి వచ్చింది. దీనిపై చింతిస్తున్నా. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం’ అని టెక్‌ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నానీ ట్వీట్‌ చేశారు.

టెక్‌ మహీంద్రా సీఈవో భారీ ప్యాకేజీ
2016–17లో గుర్నానీకి రూ. 150 కోట్లు
3 ఐటీ దిగ్గజాల చీఫ్‌ల మొత్తం రెమ్యూనరేషన్‌ కన్నా అధికం

న్యూఢిల్లీ: ఐటీ సంస్థ టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ గత ఆర్థిక సంవత్సరం జీతభత్యాల కింద ఏకంగా రూ. 150.7 కోట్ల ప్యాకేజీ అందుకున్నారు. దేశీయంగా మూడు దిగ్గజ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోల చీఫ్‌లు మొత్తం కలిపి అందుకున్న దానికన్నా ఇది అధికం కావడం గమనార్హం. అయితే, ఈ ప్యాకేజీలో ఆయన జీతం, కంపెనీ తన వంతుగా కట్టిన పీఎఫ్‌ అంతా కలిపి రూ. 2.56 కోట్లే. మిగతాదంతా కూడా కంపెనీ గతంలో కేటాయించిన స్టాక్‌ ఆప్షన్స్‌ను విక్రయించడం ద్వారా వచ్చింది.

ప్రస్తుతం టాటా సన్స్‌ చైర్మన్‌గా ఉన్న ఎన్‌.చంద్రశేఖరన్‌ గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ సీఈవోగా ఉన్నప్పుడు రూ. 30.15 కోట్లు అందుకోగా, ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కా రూ. 45.11 కోట్లు దక్కించుకున్నారు. గత మూడేళ్లుగా టాప్‌ ఎగ్జిక్యూటివ్స్‌కు భారీ వేతనాలు ఇస్తున్న టెక్‌ మహీంద్రా.. ఐటీ రంగానికి సవాళ్ల నేపథ్యంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న వారి జీతాల పెంపు మాత్రం మేనేజ్‌మెంట్‌ సమీక్ష తర్వాతే ఉంటుందని ఫిబ్రవరిలో ప్రకటించడం గమనార్హం.

మరిన్ని వార్తలు