ఆంధ్రాబ్యాంకుకు 385 కోట్ల నష్టం

3 Nov, 2017 00:57 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రాబ్యాంకు సెప్టెంబరు త్రైమాసికంలో రూ.385 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.51 కోట్ల నికరలాభం ఆర్జించింది. టర్నోవరు రూ.5,042 కోట్ల నుంచి రూ.5,005 కోట్లకు పడిపోయింది. రానిబాకీల కోసం చేసిన కేటాయింపులు రూ.992 కోట్ల నుంచి రూ.1,680 కోట్లకు చేరాయి. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) రూ.19,839 కోట్లకు (13.27 శాతం) ఎగసాయి.

గతేడాది సెప్టెంబరు త్రైమాసికంలో ఇవి రూ.16,263 కోట్లు (11.49 శాతం) ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు రూ.10,574 కోట్లుగా (7.55 శాతం) ఉన్నాయి. క్రితం ఏడాది ఇవి రూ.9,411 కోట్లు (6.99 శాతం) నమోదు చేశాయి. నికర వడ్డీ ఆదాయం 3.21 శాతంగా ఉంది. సెప్టెంబరు త్రైమాసికంలో వ్యాపారం రూ.3,19,163 కోట్ల నుంచి రూ.3,44,032 కోట్లకు ఎగసింది.

డిపాజిట్లు 9.5 శాతం, అడ్వాన్సులు 5.6 శాతం పెరిగాయి. వ్యవసాయ రుణాలు 10 శాతం పెరిగి రూ.28,680 కోట్లుగా ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈ రంగానికి ఇచ్చిన రుణాలు 27.5 శాతం అధికమై రూ.30,831 కోట్లు నమోదు చేశాయి. ప్రాధాన్య రంగానికి ఇచ్చిన అడ్వాన్సులు 3.48 శాతం పెరిగి రూ.59,187 కోట్లు, రిటైల్‌ అడ్వాన్సులు 28 శాతం అధికమై రూ.32,526 కోట్లకు చేరాయి.  

మరిన్ని వార్తలు