రూ. 13,600 కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ

19 Feb, 2016 01:44 IST|Sakshi
రూ. 13,600 కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ

ఆంధ్రాబ్యాంకు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 13,643.51 కోట్ల మేర రుణభారం ఉన్న 190 ఖాతాలను పునర్‌వ్యవస్థీకరించింది. వీటిలో చాలా మటుకు ఖాతాదారులు రూ.25 కోట్ల పైగా రుణాలు పొందినట్లు ఆర్థిక పనితీరు నివేదికలో బ్యాంకు గురువారం వెల్లడించింది.  రూ. 1 కోటి మించి.. రూ. 25 కోట్ల కన్నా తక్కువ రుణాలు ఉన్న ఖాతాల సంఖ్య 48 ఉన్నాయని, వీటి మొత్తం విలువ రూ. 378 కోట్లుగా ఉంటుందని బ్యాంకు తెలిపింది.

రూ. 1 కోటి కన్నా తక్కువ రుణ భారం ఉన్న ఖాతాలు 53 ఉన్నాయని, వీటి మొత్తం విలువ రూ. 19.51 కోట్లని పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు రూ. 691 కోట్ల మేర రుణాలు నిరర్థకంగా (ఎన్‌పీఏ) మారాయని బ్యాంకు తెలిపింది. విలువ, పరిమాణంపరంగా పరిశ్రమలకిచ్చిన రుణాలు అత్యధికంగా (90 ఖాతాలు.. రూ. 12,368 కోట్లు) పునర్‌వ్యవస్థీకరించినట్లు ఆంధ్రా బ్యాంకు తెలిపింది. ఆ తర్వాత లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (61 ఖాతాలు, రూ. 1,097 కోట్లు), వ్యవసాయ రుణాలు (24 ఖాతాలు, రూ. 177 కోట్లు) ఉన్నాయి. భారీగా పెరిగిపోయిన మొండి బకాయిలకు కేటాయింపుల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఆంధ్రా బ్యాంకు నికర లాభం ఏకంగా 83 శాతం క్షీణించి రూ. 34 కోట్లకు పడిపోయింది.

మరిన్ని వార్తలు