అంబానీకి సుప్రీం నోటీసులు

7 Jan, 2019 14:38 IST|Sakshi

ఎరిక్‌సన్‌ పిటిషన్‌ నేపథ్యంలో అనిల్‌అంబానీకి సుప్రీంకోర్టు నోటీసులు

 నాలుగువారాల్లోగా సమాధానం చెప్పాలి -సుప్రీం

తొలివిడతగా రూ. 118 కోట్లను చెల్లిస్తామన్న ఆర్‌కాం

మొత్తం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పిన ఎరిక్‌సన్‌

సాక్షి, న్యూఢిల్లీ:  రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు  నోటీసులు జారీ చేసింది. ఎరిక్‌సన్ ఇండియా దాఖలు చేసిన  కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పందన కోరుతూ  సోమవారం నోటీసులు జారీ చేసింది.  దీనికి  నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం అంబానీ, ఇతరులను ఆదేశించింది. 

అయితే బకాయి కింద రూ.118కోట్లను అంగీకరించాల్సిందిగా ఆర్‌కాం తరపున వాదించిన న్యాయవాదులు  కపిల్‌ సిబల్‌, ముకుల్‌ రోహతగి  కోర్టును కోరారు.  అయితే  ఎరిక్‌సన్‌దీనికి ససేమిరా అంది. మొత్తం బకాయిని డిపాజిట్‌ చేయాలని తేల్చి చెప్పింది. దీంతో  కోర్టు రిజిస్ట్రీలో రూ. 118 కోట్ల డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను డిపాజిట్‌  చేయాల్సింగా ఆర్‌కాంను  కోరింది. 

అలాగే రిలయన్స్‌ జియోతో కూర్చొని చర్చించి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ఆర్‌కాంకు నారిమన్‌ సూచించారు. పరస్పరం సమస్యను పరిష్కరించుకోని పక్షంతో తామేమి చేయలేమని వ్యాఖ్యానించారు.  మరోవైపు స్పెక్ట్రం ట్రేడ్ మార్గదర్శకాలకు కట్టుబడి  ఆర్‌కాం కొనుగోళ్లపై సిద్ధంగా ఉన్నారా అని  జియోను కూడా  కోర్టు ప్రశ్నించింది.  అయితే  ముందస్తు బకాయిలతో ఉన్న  సమస్యల నేపథ్యంలో, ఆర్‌కాంకు ఫిజికల్‌ గ్యారంటీ ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని జియో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. 

స్వీడిష్ టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్‌సన్‌ ఇటీవల  ఆర్‌కాంపై కోర్టు ధిక్కార పిటిషన్‌  దాఖలు చేసింది. అనిల్‌ అంబానీని అరెస్టు చేయాలని, దేశం విడిచి పారిపోకుండా నియంత్రించాలంటూ ఎరిక్‌సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  తమకు చెల్లించాల్సిన రూ.550 కోట్లు చెల్లించకుండా కావాలని తాత్సారం చేస్తోందని ఆరోపించింది.  బకాయిల చెల్లింపునకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన అనిల్‌ అంబానీ గడువు తీరినా స్పందించడం లేదని,  తద్వారా కోర్టు గడువును కూడా ఉల్లంఘించారని ఎరిక్‌సన్ తన పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు