అంబానీ రేడియో బిజినెస్‌ విక్రయానికి? 

27 May, 2019 18:27 IST|Sakshi

సాక్షి, ముంబై : అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ​(ఆర్‌కాం)ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ (ఆర్‌బీఎన్) రేడియో బిజినెస్‌ను విక్రయించేందుకు నిర్ణయించుకున్నారంటూ తాజాగా  పలు  నివేదికలు  మార్కెట్‌ వర్గాల్లో  చక్కర్లు కొడుతున్నాయి.

అనిల్ ధీరుబాయి అంబానీ గ్రూప్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్ నడుపుతున్న బిగ్‌ ఎఫ్‌ఎంను విక్రయించనుంది.  హిందీ వార్తా పత్రిక దైనిక్ జాగరన్ దీనిని సొంతం చేసుకోనుంది. దైనిక్‌ జాగరన్‌ చీఫ్ ఎడిటర్, జాగరన్ ప్రకాశన్‌ కు చెందిన బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ రూ.1200 కోట్లకు దీన్ని దక్కించుకునేందుకు సిద్ధంగా ఉందని  సమాచారం. పూర్తి నగదు రూపంలో ఈ డీల్‌ ఉండబోతోంది.  దీనికి  సంబంధించిన ప్రకటన  త్వరలోనే వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 12 వేల కోట్ల రూపాయల అప్పులు తీర్చే క్రమంలో  అంబానీకి ఈ విక్రయం భారీ ఊరటనిస్తుందని అంచనా. అయితే దీనిపై రిలయన్స్‌ గ్రూపునుంచి గానీ, ఇటు జాగరన్ ప్రకాశన్‌ నుంచి గానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.   

తాజా నివేదికల ప్రకారం మొదట 24 శాతం వాటాను ఎంబీఎల్‌ సొంతం చేసుకుంటుంది.  దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మూడేళ్లు ముగియకుండా  మేజర్‌ వాటాను విక్రయించడానికి అనుమతి లేదు. బిగ్ ఎఫ్‌ఎంలో 59 రేడియో స్టేషన్లు ఉన్నాయి.  మార్చి 31, 2018 నాటికి  బిగ్ ఎఫ్‌ఎం 45 స్టేషన్లకు లాక్-ఇన్ పీరియడ్‌ ముగిసింది, అయితే  మిగిలిన 14  స్టేషన్లకు 2020 మార్చిలో గడువు ముగుస్తుంది. దీని ప్రకారం మిగిలిన 14 స్టేషన్లు, 2020 లో వారి లాక్-ఇన్ వ్యవధి ముగిసిన తర్వాత బదిలీ అవుతాయి.

జాగరన్ ప్రకాశన్‌కు చెందిన మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌( ఎంబీఎల్‌) రేడియో సిటీ పేరుతో ఎఫ్‌ఎం చానల్‌ నిర్వహిస్తోంది. ఎంబీఎల్‌ రేడియో సిటీ బ్రాండ్ క్రింద 39 స్టేషన్లు ఉన్నాయి. ఈడీల్‌ ముగిసిన అనంతరం దేశంలోనే అదిపెద్ద ఎఫ్‌ఎం స్టేషన్‌ బ్రాండ్‌గా ఎంబీఎల్‌ అవతరించనుంది. కాగా ప్రభుత్వ అనుమతి లభించని కారణంగా ఈ బిజినెస్‌ అమ్మకానికి సంబంధించి జీ గ్రూపుతో ఒప్పందానికి గతంలో బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు