అమ్మకానికి అంబానీ రేడియో

28 May, 2019 04:52 IST|Sakshi

జాగరణ్‌ ప్రకాశన్‌ చేతికి బిగ్‌ఎఫ్‌ఎం

రూ.1,050 కోట్లకు డీల్‌

తగ్గనున్న అనిల్‌ కంపెనీల రుణభారం 

ముంబై : తీవ్ర రుణ భారంతో ఇక్కట్లను ఎదుర్కొంటున్న రిలయన్స్‌ అనిల్‌ ధీరూభాయి అంబానీ (అడాగ్‌) గ్రూపు అధినేత అనిల్‌ అంబానీ, ఆ భారాన్ని తగ్గించుకునే దిశగా మరో ముందడుగు వేశారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవల సంస్థ రిలయన్స్‌ నిప్పన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌లో తన వాటాను మరో భాగస్వామి నిప్పన్‌ లైఫ్‌కు విక్రయించేందుకు ఇప్పటికే డీల్‌ కుదుర్చుకోగా, బిగ్‌ఎఫ్‌ఎం పేరుతో దేశవ్యాప్తంగా ఎఫ్‌ఎం చానళ్లను నిర్వహించే రిలయన్స్‌ బ్రాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ (ఆర్‌బీఎన్‌ఎల్‌) విక్రయం విషయంలోనూ పురోగతి సాధించారు. జాగరణ్‌ ప్రకాశన్‌ గ్రూపునకు ఆర్‌బీఎన్‌ఎల్‌ను రూ.1,050 కోట్లకు విక్రయించనున్నట్టు రిలయన్స్‌ క్యాపిటల్‌ సోమవారం ప్రకటించింది. కీలకం కాని వ్యాపారాలను విక్రయించాలన్న తమ వ్యూహంలో భాగమే ఈ లావాదేవీ అని రిలయన్స్‌ క్యాపిటల్‌ సీఎఫ్‌వో అమిత్‌బప్నా పేర్కొన్నారు. నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌లో వాటా విక్రయం ద్వారా రిలయన్స్‌ క్యాపిటల్‌కు రూ.6,000 కోట్లు సమకూరనున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతుల రాకలో జాప్యం కారణంగా గతంలో ఆర్‌బీఎన్‌ఎల్‌ను జీ గ్రూపుకు విక్రయించాలనే ఒప్పందం విఫలమైన విషయం విదితమే.
  
తొలుత 24 శాతం వాటా... 
దైనిక్‌ జాగరణ్‌ పేరుతో హిందీ దినపత్రికను ప్రచురించే జాగరణ్‌ ప్రకాశన్‌కు రేడియో సిటీ పేరుతో ఎఫ్‌ఎం చానళ్లను నిర్వహించే మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌ (ఎంబీఎల్‌) కంపెనీ ఉంది. దీని ద్వారా ఆర్‌బీఎన్‌ఎల్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఆర్‌బీఎన్‌ఎల్‌ను కొనుగోలు చేసే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్టు ఎంబీఎల్‌ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆర్‌బీఎన్‌ఎల్‌లో తొలుత 24 శాతం వాటాను రూ.202 కోట్ల ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ ద్వారా ఎంబీఎల్‌ కొనుగోలు చేయనుంది. తర్వాత అన్ని నియంత్రణ సంస్థ ల అనుమతులకు లోబడి ఆర్‌బీఎన్‌ఎల్‌లో మిగిలిన వాటాను రూ.1,050 కోట్లకు సొంతం చేసుకోనుంచి. మొత్తం సంస్థ విలువ రూ.1,050 కోట్లు’’ అని రిలయన్స్‌ క్యాపిటల్‌ తన ప్రకటనలో పేర్కొంది. కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. బిగ్‌ఎఫ్‌ఎం నెట్‌వర్క్‌ కింద ఆర్‌బీఎన్‌ఎల్‌కు 58 ఎఫ్‌ఎం స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 40 ఎఫ్‌ఎం స్టేషన్లు ఈ ఒప్పందంలో భాగంగా ఎంబీఎల్‌కు వెళ్లనున్నాయి. దీంతో మొత్తం 79 రేడియో స్టేషన్లతో అతిపెద్ద ఎఫ్‌ఎం రేడియో నెట్‌వర్క్‌గా ఎంబీఎల్‌ అవతరించనుంది. ఇక బిగ్‌ఎఫ్‌ఎం కింద మిగిలిన 18 ఎఫ్‌ఎం స్టేషన్లను రెండో దశ లావాదేవీ కింద మరో రూ.150 కోట్లకు ఎంబీఎల్‌కు కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. ఆర్‌బీఎన్‌ఎల్‌కు లోగడ జీ గ్రూపు రూ.1,872 కోట్లను ఆఫర్‌ చేయగా, దాంతో పోలిస్తే జాగరణ్‌ ఇవ్వచూపిన రూ.1,200 కోట్లు తక్కువేనని తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు