ఎన్‌డీటీవీకి రాఫెల్‌ సెగ : రూ.10వేల కోట్ల దావా

19 Oct, 2018 14:33 IST|Sakshi


సాక్షి,న్యూఢిల్లీ:  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని  ఇరకాటంలో పెట్టిన  రాఫెల్‌ డీల్‌   సెగ ఎన్‌డీటీవీని తాకింది. రాఫెల్‌ ఫైటర్‌ జెట్స్‌ కొనుగోలు వివాదంలో   ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు  అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్  ఎన్‌డీటీవీపై కోట్ల రూపాయల దావా వేసింది. రాఫెల్‌ డీల్‌కు సంబంధించి అవాస్తవాలను, కట్టుకథలను ప్రసారం చేసిందని  ఆరోపిస్తూ  గుజరాత్‌లోని  అహ్మదాబాద్‌ కోర్టులో  రిలయన్స్‌  గ్రూపు  పదివేల కోట్ల రూపాయలకు దావా వేసింది.  అక్టోబరు 26న దీనిపై విచారణ జరగనుంది. ఎన్‌టీవీలో  సెప్టెంబరు 29 న ప్రసారం చేసిన వీక్లీ  ప్రోగ్రాం  ‘ట్రూత్  వెర్సస్‌ హైప్స్‌’పై ఈ కేసు ఫైల్‌ చేసింది.

అయితే దీనిపై ఎన్‌డీటీవీ స్పందించింది. న్యాయపరమైన పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని  తెలిపింది. రిలయన్స్‌ చేసిన పరువు నష్టం ఆరోపణలను తిరస్కరించింది. ఒ‍క వార్తా సంస్థగా  సత్యాన్ని బయటపెట్టే  బాధ్యత తమకుందనీ, స్వతంత్ర, న్యాయమైన జర్నలిజానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం  చేసింది.  అంతేకాదు ఇది మీడియాకు  ఒక హెచ్చరిక అని ఎన్‌డీటీవీ వ్యాఖ్యానించింది.

కాగా రాఫెల్‌ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం జోరుగా సాగుతోంది. దివాలా తీసిన అనిల్ అంబానీకి బిల్లియన్ల డాలర్లను కట్టబెట్టేందుకే  ప్రభుత్వరంగ సంస్థను  కాదని మరీ రిలయన్స్‌ డిఫెన్స్‌కు ఈ కాంట్రాక్టును అప్పగించిందని నరేంద్రమోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ  తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.  ఈ వివాదానికి  ఫ్రాన్స్‌ మాజీ  అధ్యక్షుడు  ఫ్రాంకోయిస్‌ హోలెండ్‌   వ్యాఖ్యలతో మరింత అగ్గి  రగిలింది. ‘దేశ్‌ కీ చౌకీదార్, అనిల్‌ అంబానీ కా చౌకీదార్‌ బన్‌గయా’  అంటూ మోదీపై  రాహుల్‌ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు