ఆర్‌కామ్‌కు అనిల్‌ అంబానీ రాజీనామా

16 Nov, 2019 17:53 IST|Sakshi

ముంబై : సంక్షోభం అంచున నిలిచిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌గా అనిల్‌ అంబానీ శనివారం వైదొలిగారు. అనిల్‌ సహా నలుగురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. దివాలా ప్రక్రియ కింద ఆస్తులు అమ్మకానికి ఉంచిన ఆర్‌ కామ్‌ నుంచి అనిల్‌ అంబానీతో పాటు ఛాయా విరాని, రైనా కరానీ, మంజరి కకేర్‌, సురేష్‌ రంగాచార్‌లు డైరెక్టర్‌లుగా వైదొలిగారు. బీఎస్‌ఈకి ఇచ్చిన నోటీసులో ఈ మేరకు కంపెనీ పేర్కొంది. కాగా గతంలో కంపెనీ డైరెక్టర్‌, సీఎఫ్‌ఓ వీ మణికంఠన్‌ రాజీనామా చేశారని, వీరి రాజీనామాలను కంపెనీ రుణదాతల కమిటీకి నివేదిస్తామని ఆర్‌ కామ్‌ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ర్టం బకాయిలకు కేటాయింపుల అనంతరం కంపెనీ నష్టాలు రూ 30,142 కోట్లకు చేరిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. టెలికాం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం గుబులు రేపుతోంది. ఇక లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం బకాయిలకు కేటాయింపుల అనంతరం వొడాఫోన్‌ జులై-సెప్టెంబర్‌ కాలానికి రూ 50,921 కోట్ల నష్టాలు ప్రకటించగా, భారతి ఎయిర్‌టెల్‌ రూ 23,000 కోట్ల నష్టాలను నమోదు చేసింది.

మరిన్ని వార్తలు