మరో 3 కంపెనీల కార్ల ధరలు అప్

5 Mar, 2016 00:07 IST|Sakshi
మరో 3 కంపెనీల కార్ల ధరలు అప్

జాబితాలో మహీంద్రా, హోండా, హ్యుందాయ్ మోటార్స్
న్యూఢిల్లీ: మొన్న టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్.. నిన్న మారుతీ సుజుకీ.. నేడు హ్యుందాయ్, హోండా, మహీంద్రా.. ఇలా వాహన తయారీ కంపెనీలన్నీ వాటి కార్ల ధరలను వరుసపెట్టి పెంచేస్తున్నాయి. దీనికి బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సు వడ్డింపే ప్రధాన కారణం. హోండా మోటార్ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా శుక్రవారం తమ ప్యాసెంజర్ వాహన ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి.

 హోండా రూ. 79 వేల వరకూ...
హోండా కార్స్ ఇండియా  కార్ల ధరలను రూ.79,000 వరకు పెంచింది. ఎంట్రీ స్థాయి కారు బ్రియో ధరను రూ.4,000-రూ.6,000 శ్రేణిలో, ప్రీమియం హాచ్‌బ్యాక్ జాజ్ ధరను రూ.5,000-రూ.19,500 శ్రేణిలో, మధ్య స్థాయి సెడాన్ సిటీ ధరను రూ.24,600-రూ.38,100 శ్రేణిలో పెంచినట్లు వివరించింది. అలాగే కంపెనీ మల్టీ యుటిలిటీ వాహనం మొబిలియో ధరను రూ.21,800-రూ.37,700 శ్రేణిలో, ప్రీమియం ఎస్‌యూవీ సీఆర్-వీ ధరను రూ.66,500-రూ.79,000 శ్రేణలో పెంచింది.ధరల పెంపు నిర్ణయం మార్చి 1 నుంచి అమలులోకి వచ్చిందని కంపెనీ తెలిపింది.

 హ్యుందాయ్ రూ. 82,902 దాకా...
హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల ధరలను రూ.2,889-రూ.82,906 శ్రేణిలో పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.  ధరల పెంపు మార్చి 1 నుంచి అమలులోకి వచ్చిందని కంపెనీ తెలిపింది.

 మహీంద్రా రూ.47,000 వరకూ...
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ప్యాసెంజర్ వాహన ధరలను రూ.5,500-రూ.47,000 శ్రేణిలో పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది. అయితే దీనికి కేయూవీ 100 మోడల్ మాత్రం మినహాయింపు. దీని పెట్రోల్ వెర్షన్ ధర 1 శాతంమేర, డీజిల్ వేరియంట్ ధర 2.5 శాతంమేర పెంచినట్లు కంపెనీ తెలిపింది. ఈ ధరలు మాత్రం తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు