బెస్ట్ ప్రైస్ నుంచి మరో 50 ఔట్‌లెట్లు

23 Aug, 2014 03:17 IST|Sakshi
బెస్ట్ ప్రైస్ నుంచి మరో 50 ఔట్‌లెట్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాష్ అండ్ క్యారీ కంపెనీ వాల్‌మార్ట్ ఇండియా పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. బెస్ట్ ప్రైస్ ఔట్‌లెట్ల సంఖ్యను నాలుగైదేళ్లలో ప్రస్తుతమున్న 20 నుంచి 70కి పెంచనుంది. ఇందుకోసం రూ.3,000-3,600 కోట్లు వ్యయం చేయనుంది. భారత్‌లో 1,000 స్టోర్లు ఉండేంతగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని సంస్థ కార్పొరేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ రజ్‌నీష్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. సమయం వచ్చినప్పుడు పెట్టుబడి పెడతామని వెల్లడించారు. ఒక్కో స్టోర్‌కు రూ.60-72 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. అనువైన ప్రాంతం ఎంపిక, స్థల సేకరణ, అనుమతులు వెరశి స్టోర్ కార్యరూపం దాల్చడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుంది. కొత్త ప్రభుత్వం రాకతో ఈ సమయం తగ్గుతుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.  

 రిటైల్‌లోకి సిద్ధం..
 ప్రభుత్వం 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తే మల్టీబ్రాండ్ రిటైల్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నామని రజ్‌నీష్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యూహంతోనే భారత్‌లో ప్రవేశించామని అన్నారు. క్యాష్ అండ్ క్యారీ విభాగంలో భారత్‌లో తమ సంస్థ మార్కెట్ లీడర్‌గా ఉందని చెప్పారు. 9 లక్షలకుపైగా కస్టమర్లున్నారని పేర్కొన్నారు. వీరిలో 70 శాతంపైగా కిరాణా వ్యాపారులు ఉన్నారని చెప్పారు. ఏటా 20 శాతం వృద్ధి కనబరుస్తున్నామని వివరించారు. హైదరాబాద్, లక్నో కస్టమర్ల కోసం ఇ-కామర్స్ విధానాన్ని పరిచయం చేశామని, ఇతర స్టోర్లకు దీనిని విస్తరిస్తున్నట్టు తెలిపారు. ‘95 శాతం ఉత్పత్తులను దేశీయంగానే సేకరిస్తున్నాం. రైతులకు, తయారీదారులకు మార్కెట్ కంటే మంచి ధర చెల్లిస్తున్నాం. మా విక్రయ ధర కూడా తక్కువగానే ఉంటుంది’ అని వివరించారు.

 9 శాతం వృద్ధి..
 రిటైల్ వ్యాపారం భారత్‌లో రూ.25.2 లక్షల కోట్లుంది. ఇందులో హోల్‌సేల్ వ్యాపారం రూ.18 లక్షల కోట్లు. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం 9 శాతం వృద్ధితో రూ.3 లక్షల కోట్లుంది. ఆధునిక రిటైల్ వాటా 8 శాతం మాత్రమే. ఈ రంగం ఏటా 8 శాతం వృద్ధి చెందుతోంది. సంప్రదాయ వ్యాపారం వృద్ధి రేటు 9 శాతంగా ఉంది. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో బెస్ట్ ప్రైస్ స్టోర్లున్నాయి. బిజినెస్ టు బిజినెస్ విధానంలో అంటే కిరాణా దుకాణాల వర్తకులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల నిర్వాహకులకు మాత్రమే బెస్ట్ ప్రైస్ ఔట్‌లెట్లలో సరుకులను విక్రయిస్తారు. 5 వేలకుపైగా రకాలను అందుబాటులో ఉంచారు.

మరిన్ని వార్తలు