బ్యాంకులకు టోకరా.. వ్యాపారవేత్తల పరారీ

9 May, 2020 11:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎస్బీఐతో పాటు ఇత‌ర బ్యాంకుల వ‌ద్ద‌ సుమారు రూ.400 కోట్ల రుణం తీసుకుని, ఎగ్గొట్టడమే కాకుండా విదేశాలకు చెక్కేశారు మరో సంస్థ యజమానులు. విజయ్‌మాల్యా, నీరవ్ మోడీల మాదిరిగానే మరో సంస్థకు చెందిన యజమానులు బ్యాంకుల వద్ద వందల కోట్ల అప్పులు చేసి ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిపోయారు. ఢిల్లీకి చెందిన బాస్మ‌తి బియ్యం ఎగుమ‌తిదారులు రామ్‌దేవ్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ఓనర్లు మొత్తం ఆరు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు. కంపెనీ డైరక్టర్లు అయిన నరేశ్ కుమార్, సురేశ్ కుమార్, సంగీతలు 2016 నుంచి మిస్సింగ్‌లో ఉన్న‌ట్లు తేలింది. అయితే గత ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన ఎస్‌బీఐ సదరు డిఫాల్ట‌ర్లపై ఫిర్యాదు చేసింది. సీబీఐ ఏప్రిల్ 28వ తేదీన కేసు బుక్ చేసింది. కంపెనీ డైరక్టర్లు అయిన నరేశ్ కుమార్, సురేశ్ కుమార్, సంగీతలపై కేసులు ఫైల్ చేశారు. ఫోర్జరీ, చీటింగ్ వంటి క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

ఎస్‌బీఐ నుంచి రూ.173.11 కోట్లు, కెనెరా బ్యాంకు నుంచి రూ.76.09కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.64.31కోట్లు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.51.31కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంక్‌ నుంచి రూ.36.91కోట్లు, ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.12.27కోట్లు అప్పులు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు