బోర్డు తిప్పేసిన మరో బ్రోకరేజ్‌ సంస్థ

11 Apr, 2018 00:24 IST|Sakshi

బిచాణా ఎత్తేసిన ఎఫ్‌6 ఫిన్‌సర్వ్‌

రూ. 100 కోట్లకు కుచ్చుటోపి?  

న్యూఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఎఫ్‌6 ఫిన్‌సర్వ్‌ తాజాగా దుకాణం కట్టేసింది. దీంతో గత రెండేళ్లలో చెల్లింపులు చెల్లించలేక డిఫాల్టయిన స్టాక్‌ బ్రోకర్ల సంఖ్య 11కు చేరింది. తాజాగా బోర్డు తిప్పేసిన ఎఫ్‌6 సంస్థ దాదాపు 100 కోట్ల రూపాయల పైచిలుకు ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సొమ్మంతా బ్రోకరేజ్‌ సంస్థ క్లయింట్లకు చెప్పకుండా మార్కెట్లో స్పెక్యులేషన్లకు వాడుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తమ క్లయింట్ల అనుమతి లేకుండా, వారికి ఎలాంటి సమాచారం లేకుండా వారి షేర్లను ఎఫ్‌6 సంస్థ ప్రమోటర్లు పంకజ్, సుమిత్‌ గోయల్‌లు విక్రయించి సొమ్ము చేసుకున్నారని తెలిసింది. ఇలా పోగు చేసిన మొత్తాన్ని వివిధ షేర్లు, పొజిషన్ల స్పెక్యులేషన్‌లో వాడారు. వీరి చర్యల కారణంగానే మార్చి 26– ఏప్రిల్‌ 2 మధ్య క్వాలిటీ ఐస్‌క్రీమ్‌ షేరు ఒక్కపాటున 35 శాతం వరకు పతనమైంది. ఎఫ్‌6 ప్రమోటర్లు తమ డైరెక్టర్లకు చెందిన షేర్లను అనుమతి లేకుండా విక్రయించారని క్వాలిటీ ఐస్‌క్రీమ్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు ఫిర్యాదు సైతం చేసింది.  

ఏం చేశారు?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎఫ్‌6 ప్రమోటర్లు ఇన్వెస్టర్లకు తెలియకుండా వారి సొమ్ములను ఆప్షన్‌ మార్కెట్లో, ఐపీఓ గ్రే మార్కెట్లో వెచ్చించారని తెలిసింది. ఈ సొమ్ముతో పెద్ద ఎత్తున ఆప్షన్లను రైట్‌ చేసినట్లు సమాచారం. అయితే ఫిబ్రవరిలో మార్కెట్లు ప్రతికూలంగా మారడంతో ఈ సొమ్మంతా ఊడ్చిపెట్టుకుపోయింది. గత  ఏడాది కాలంలో ఇలా క్లయింట్ల సొమ్ము వాడుకొని బ్రోకరేజ్‌ సంస్థలు బోర్డు తిప్పేయడం ఎక్కువయింది.

ఇలాంటి సంస్థలన్నీ కలిసి దాదాపు రూ. 300 కోట్లకు మోసం చేసి ఉంటాయని అంచనా. ఇలా డిఫాల్టయిన బ్రోకరేజ్‌సంస్థల్లో కొన్ని అనధికార ఎన్‌బీఎఫ్‌సీలుగా పనిచేస్తున్నాయి. క్లయింట్లకు సుమారు 12– 14 శాతం రాబడి హామీతో సొమ్ములు సమీకరించడం చేస్తున్నాయి. వీటికి కళ్లెం వేయడానికి సెబి గతేడాది కొన్ని నిబంధనలను తీసుకువచ్చినా బ్రోకరేజ్‌ల మోసాలు ఆగట్లేదు.

ఏం చేయాలి?
ఎఫ్‌6 తరహా బ్రోకరేజ్‌ల చేతిలో మోసపోయిన క్లయింట్లు తమకు రక్షణ కల్పించమని ఎక్సే్ఛంజ్‌లను కోరవచ్చు. ఎక్సే్ఛంజ్‌లు డిఫాల్టింగ్‌ బాధితులను ఆదుకోవడం కోసం ఇన్వెస్టర్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ను నిర్వహిస్తుంటాయి.

ఇలాంటి మోసాలకు గురైన క్లయింట్లు దగ్గర్లోని మదుపరుల సేవా సంస్థను సంప్రదించాలని, ఒక ఆర్బిట్రేషన్‌ ఫారమ్‌ పూర్తి చేయాలని బోంబే షేర్‌హోల్డర్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు అశోక్‌ బక్లివాల్‌ సూచించారు. అప్పుడు బాధితుల కోసం ఎక్చేంజ్‌లు ఒక ఆర్బిట్రేటర్‌ను నియమించి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తాయని, ఫిర్యాదు నిజమైతే 120 రోజుల్లో క్లయింట్‌కు దాదాపు 15 లక్షల రూపాయల వరకు పరిహారం అందుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు