మరో క్రూడ్‌ ఆయిల్‌ షాక్‌

14 Jun, 2018 17:28 IST|Sakshi

న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణానికి క్రూడ్‌ ఆయిల్‌ షాక్‌ తగిలింది. హోల్‌సేల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టానికి ఎగిసింది. మే నెలలో డబ్ల్యూపీఏ ద్రవ్యోల్బణం 4.43 శాతంగా నమోదైనట్టు తెలిసింది. ఈ ద్రవ్యోల్బణం ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడమేనని ప్రభుత్వ డేటాలో తెలిసింది. ఏప్రిల్‌ నెలలో ఈ ద్రవ్యోల్బణం 3.18 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.26 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 1.60 శాతంగా నమోదైందని ప్రభుత్వ డేటా పేర్కొంది. అంతకముందు నెలలో ఈ ద్రవ్యోల్బణం 0.87 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు కూడా మే నెలలో 2.51 శాతానికి పెరిగాయి. గత నెలలో ఈ ద్రవ్యోల్బణం నెగిటివ్‌లో -0.89 శాతంగా ఉంది.

ఇంధనం, విద్యుత్‌ బాస్కట్‌లో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ నెలలో 7.85 శాతంగా ఉంటే, మే నెలలో 11.22 శాతానికి పెరిగింది. గ్లోబల్‌గా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో, దేశీయంగా కూడా ఈ ధరలు పైపైకి ఎగిశాయి. దీంతో ఇంధన ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. పొటాటో ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్‌ నెలలో 67.94 శాతంగా నమోదైతే, మే నెలలో 81.93 శాతం రికార్డైంది. ఇలా అన్ని ధరలు పెరగడంతో, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టానికి ఎగిసినట్టు తెలిసింది. 2017 మార్చిలో డబ్ల్యూపీఐ 5.11 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. క్రూడ్‌ దెబ్బతో దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ముందుగానే ఊహించిన ఆర్‌బీఐ, ఇటీవల నిర్వహించిన తన పాలసీ సమీక్షలో కీలక రెపో రేటు 0.25 శాతం పెంచింది. ఏప్రిల్‌ నెలలో బ్యారల్‌కు 66 డాలర్లుగా ఉన్న క్రూడ్‌, ప్రస్తుతం 74 డాలర్లు పలుకుతోంది. 
 

మరిన్ని వార్తలు