స్టీల్‌ ఉత్పత్తులపై యాంటీడంపింగ్‌ డ్యూటీ..?

19 Jun, 2020 11:45 IST|Sakshi

కేంద్రానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సిఫార్సు

విదేశాల నుంచి భారత్‌లోకి దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులపై యాంటీడంపింగ్‌ డ్యూటీ విధించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశీయ స్టీల్‌ ఉత్పత్తిదారులను ఆదుకునే చర్యల్లో భాగంగా యూరప్‌, జపాన్‌, అమెరికా, కొరియా దేశాల నుంచి దిగుమతి అవుతున్న స్టీల్‌ ఉత్పత్తులపై 5ఏళ్ల పాటు ఈ డ్యూటీని విధించనుంది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ దేశాల నుంచి దిగుమతయ్యే స్టీల్‌ ఉత్పత్తులపై టన్నుకు 222డాలర్ల నుంచి 334 డాలర్ల పరిధిలో యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అలాగే నాణ్యత ఆధారంగా ఉత్పత్తులకు డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌ను తిరస్కరించింది. 

యూరప్‌, జపాన్‌, అమెరికా, కొరియా దేశాల నుంచి భారత్‌లోకి సగటు ధర కంటే తక్కువ విలువలో స్టీల్‌ ఉత్పత్తులు దిగుమతి అవుతుండటంతో యాంటీ డంపింగ్‌ డ్యూటీ విధించేందుకు వాణిజ్య శాఖ సిపార్సు చేసింది. తక్కువ ధరల్లో స్టీల్‌ ఉత్పత్తుల దిగుమతుల కారణంగా దేశీయ స్టీల్‌ పరిశ్రమ నష్టాలను ఎదుర్కోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) నివేదికలో తెలిపింది. 

యాంటీ డంపింగ్‌ డ్యూటీ అంటే..?

ఇత‌ర దేశాల నుంచి ఏదైనా స‌రుకు లేదా వ‌స్తువుల‌ను మన మార్కెట్ లో ల‌భించే ధ‌ర కంటే త‌క్కువ ధ‌ర‌కు దిగుమ‌తి చేస్తే వాటిపై విధించే టారిఫ్‌ను యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు. సాధారణంగా స్వదేశీ వ్యాపారాన్ని ర‌క్షించేందుకు చాలా దేశాలు ఈ ర‌క‌మైన టారీఫ్ విధిస్తుంటాయి.

మరిన్ని వార్తలు