చోక్సీపై ఆంటిగ్వా ప్రభుత్వం న్యూ ట్విస్ట్‌

3 Aug, 2018 15:07 IST|Sakshi

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుల్లో ఒకడైన మెహుల్ చోక్సీ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ద్రోహులకు తమ దేశంలో స్థానంలేదు, ఇరుదేశాల స్నేహ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన ఆంటిగ్వా అండ్ బర్బూడా  ప్రభుత్వం తాజాగా యూ టర్న్ తీసుకుంది. మెహుల్ చోక్సీకి పౌరసత్వం మంజూరు చేయడంలో తామేమీ తప్పు చేయలేదని  ప్రకటించింది.  భారత  ప్రభుత్వ సానుకూల నివేదిక ఆధారంగాను ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేసినట్టు తెలిపింది.  ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాటు జరగలేదని వివరించింది. ఈ కొత్త  మలుపుతో చోక్సీని భారత్‌కు రప్పించాలని చూస్తున్న ప్రభుత్వానికి కొత్తతలనొప్పి మొదలైంది. అయితే చోక్సీపై నేరారోపణలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించిన అనంతరం చోక్సీ అప్పగింత అంశాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంటిగ్వా  విదేశాంగ మంత్రి  వెల్లడించారు. 

మెహుల్‌ చోక్సీ 2017 మేలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా, భారతదేశ హోం శాఖ, సెబీ సానుకూల నివేదికలు ఇచ్చాయని ఆంటిగ్వా అండ్ బర్బూడా ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడిదారుల యూనిట్, క్యాపిటల్ మార్కెట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ద్వారా ప్రభుత్వం నుంచి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త మెహుల్ చోక్సికి పౌరసత్వాన్ని మంజూరు చేసినట్టు తెలిపింది. అలాగే విదేశీ వ్యవహారాల రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి వచ్చిన ధ్రువపత్రంలోనూ చోక్సీకి సంబంధించి ప్రతికూల అంశాలేమీ లేవని ఆంటిగ్వా వెల్లడించింది. అంతేకాదు చోక్సీ దరఖాస్తుపై నేపథ్య తనిఖీలు కూడా చేశామని తెలిపింది. ఏ సందర్భంలోనూ ఆయన ధరఖాస్తుపై అనుమానాస్పద సమాచారం లేదని పేర్కొంది.  ప్రస్తుతం చోక్సీ  తమ దేశ పౌరుడు కనుక ఆయనను దేశం నుంచి పంపించలేమని స్పష్టం  చేసింది.  అయితే  చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే చట్టబద్ధమైన ప్రక్రియను చేపట్టవలసి ఉంటుందని  పేర్కొంది.
 

మరిన్ని వార్తలు