ఏపీ రేవుల రంగంలో పెట్టుబడి అవకాశాలు

12 Dec, 2016 15:19 IST|Sakshi
ఏపీ రేవుల రంగంలో పెట్టుబడి అవకాశాలు

త్వరలో రెండో స్థానంలోకి
కృష్ణపట్నం పోర్ట్ సీఈవో అనిల్ యెండ్లూరి


సాక్షి, అమరావతి: తూర్పు తీరానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఓడరేవుల రంగంలో పెట్టుబడులకు అపారఅవకాశాలున్నాయని కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి తెలిపారు. చైనాలో షెన్‌జెన్ నగరం కేవలం ఓడరేవులతో 300 బిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థను సృష్టించిందని, అదే విధమైన అవకాశాలు ఇక్కడ కూడా ఉన్నాయన్నారు. 974 కి.మీ పొడవైన తీరాన్ని కలిగి ఉన్న రాష్ట్రంలో మొత్తం 14 ఓడరేవులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మంగళవారం విజయవాడలో ’పోర్టులు-లాజిస్టిక్స్’ అనే అంశంపై సీఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్  నిర్వహించిన సదస్సులో అనిల్ మాట్లాడుతూ త్వరలోనే రేవుల రంగంలో రాష్ట్రం మహారాష్ట్రను దాటి రెండవ స్థానానికి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

45 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్‌ను అధగమించడానికి మరికొంత సమయం పడుతుందన్నారు.రాష్ట్రంలోని 13 జిల్లాల్లో హైవేలు, రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు, కంటైనర్లు, లాజిస్టిక్స్‌పై మరింత దృష్టిపెట్టాలన్నారు.  కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్‌ఆర్‌టీసీ వైస్ చైర్మన్ ఎం. మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రమంతా కోస్తా తీరం ఉండటంతో వాతావరణ మార్పులు వల్ల జరిగే నష్టాలను అధిగమించే విధంగా మౌలికవసతులు పెంచుకోవాలన్నారు. చెన్నై-వైజాగ్, బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడర్లలో భాగంగా రాష్ట్రంలో ఏడు నాడ్‌‌సను అభివృద్ధి చేస్తున్నామని ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సి.కుటుంబరావు తెలిపారు.

మరిన్ని వార్తలు