ఏపీ ఐటీ పార్కు వాటాను విక్రయించనున్న ఎల్‌అండ్‌టీ

20 Aug, 2015 01:37 IST|Sakshi
ఏపీ ఐటీ పార్కు వాటాను విక్రయించనున్న ఎల్‌అండ్‌టీ

గన్నవరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీఐఐసీ భాగస్వామ్యంలో కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఐటీ పార్కులోని తన వాటాను వేరే సంస్థకు విక్రయించేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ సిద్ధమవుతోంది. యూకే ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌లో నడుస్తున్న గ్రీన్‌కో గ్రూపుకు 74శాతం వాటాను విక్రయించేందుకు ఇప్పటికే ఎల్‌అండ్‌టీ ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విక్రయ ప్రక్రియ పూర్తయితే డిసెంబరునాటికి ఐటీ పార్కు గ్రీన్‌కో చేతులోకి వెళుతుంది.

ఈ పార్కు విలువ దాదాపు రూ. 100 కోట్లు వుండవచ్చని అంచనా. కోస్తా ప్రాంతంలోని ఐటీ ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి నిర్మాణంలో ఉన్న జిల్లాజైలు స్థలాన్ని ఐటీ పార్కుకు కేటాయించారు. సుమారు 30 ఎకరాల్లో ఏపీఐఐసీ 26శాతం, ఎల్‌అండ్‌టీ 74శాతం భాగస్వామ్యంతో ఐదు టవర్లతో కూడిన ఐటీ పార్కు నిర్మాణాన్ని చేపట్టింది. 2009లో పూర్తయిన మొదటి టవర్ మేధాలో నాలుగు సంస్థలు మాత్రమే ఐటీ కార్యకలాపాలు ప్రారంభించాయి. తర్వాతి కాలంలో ఇక్కడ్నుంచి ఐటీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇతర సంస్థలు ముందుకురాలేదు.

విజయవాడ నగరంతో పోల్చితే ఇక్కడ అద్దెలు, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండడంతోపాటు 24 గంటల రవాణా సౌకర్యం లేకపోవడం ఓ కారణం. సుమారు  1.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన మేధా టవర్‌లో కేవలం 20వేల చ.అ. విస్తీర్ణంలో ఐటీ సంస్థలు నడుస్తున్నాయి. మిగిలిన 1.60 చ.అ. ఆరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో ఈ ఐటీ సెజ్‌లోని తన వాటాను విక్రయించేందుకు కొంత కాలంగా ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రయత్నాలు సాగిస్తోంది. స్థానిక ఐటీ పార్కుతోపాటు వైజాగ్, హైదరాబాద్‌లోని ఎల్‌అండ్‌టీకి చెందిన ఐటీ సెజ్‌ల్లోని వాటాలను కూడా విక్రయించేందుకుగ్రీన్‌కో గ్రూపుతో ఎల్‌అండ్‌టీ పెద్ద మొత్తంలోనే డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు