సేవల విస్తృతిపై అపోలో ఫోకస్‌ 

31 Jan, 2019 03:51 IST|Sakshi

జాయింట్‌ ఎండీ సంగీత రెడ్డి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆసుపత్రుల విస్తరణ కంటే సేవల విస్తృతిపైనే ఈ ఏడాది ఎక్కువగా ఫోకస్‌ చేస్తామని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఫిక్కీ సమావేశంలో పాల్గొన్న ఆమె ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఆసుపత్రుల పరంగా దేశంలో మేమే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం. అవసరమైన చోట హాస్పిటల్, ఫార్మసీల ఏర్పాటు ప్రక్రియ సహజంగా జరుగుతుంది.

దానికంటే ముఖ్యంగా ఇప్పుడున్న మొత్తం ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవటంపై దృష్టి సారిస్తాం. హెల్త్‌ చెకప్స్‌ను ప్రమోట్‌ చేయడం, జన్యు ఔషధాలు, రోగుల ఇంటెస్టిన్‌ (ప్రేగు) అధ్యయనం ప్రధానాంశాలుగా చేసుకున్నాం. ఒక అడుగు ముందుకేసి వైద్య సేవల రంగాన్ని నిర్వచిస్తాం. చెన్నైలో అపోలో ప్రోటాన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ను 150 పడకల సామర్థ్యంతో నెలకొల్పాం. దక్షిణాసియాలో ఇది తొలి ప్రోటాన్‌ థెరపీ సెంటర్‌. క్యాన్సర్‌ చికిత్సలో అత్యాధునిక పెన్సిల్‌ బీమ్‌ టెక్నాలజీని వాడుతున్నాం. లక్నోలో 250 పడకలతో ఏర్పాటవుతున్న ఆసుపత్రి రెండు నెలల్లో ప్రారంభం కానుంది’ అని  సంగీత రెడ్డి  వెల్లడించారు. 

తెలంగాణలో లాజిస్టిక్స్‌ పార్కులు 
తెలంగాణలో మరో రెండు లాజిస్టిక్స్‌ పార్కులు ఏర్పాటు కానున్నాయి. అదానీ గ్రూప్, టెక్స్‌టైల్‌ రంగ సంస్థ వెల్‌స్పన్‌ గ్రూప్‌ వీటిని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు. బుధవారమిక్కడ జరిగిన ఫిక్కీ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విషయం చెప్పారు.

‘తెలంగాణకు గడిచిన నాలుగున్నరేళ్లలో సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 60 శాతం కార్యరూపం దాల్చాయి. రానున్న కాలంలో ఇది 90–95 శాతానికి వెళ్తుందన్న నమ్మకం ఉంది. కొన్ని కంపెనీలు రెండు, మూడవ దఫా కూడా విస్తరించాయి. ఈ రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానమే ఇందుకు కారణం. ఏడు కేసుల్లో మినహా 8,500 పైచిలుకు కంపెనీలకు 15 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేశాం’ అని గుర్తు చేశారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా