బాటానగర్‌లో అపోలో ఆసుపత్రి

10 Sep, 2014 01:09 IST|Sakshi
బాటానగర్‌లో అపోలో ఆసుపత్రి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రెజ్ పశ్చిమ బెంగాల్‌లోని బాటానగర్‌లో ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం స్థల సేకరణలో ఉన్నామని అపోలో జాయింట్ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. అపోలో భాగస్వామ్యంతో యూఎస్‌కు చెందినఆలివ్‌కోర్ మొబైల్ ఈసీడీ పరికరాన్ని మంగళవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా ఆమె సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.

 ప్రతిపాదిత ఆసుపత్రిని 250 పడకల సామర్థ్యంతో తీసుకొస్తామని వెల్లడించారు. ఒక్కో పడకకు రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు సంస్థ వ్యయం చేయనుంది. కోల్‌కతాలోని మెరిడియన్ మెడికల్ రీసెర్చ్, హాస్పిటల్‌కు చెందిన వెస్ట్ బ్యాంక్ ఆసుపత్రి కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్టు ఆమె చెప్పారు. వెస్ట్ బ్యాంక్ ఆసుపత్రి సామర్థ్యం 250 పడకలు.

 100కుపైగా క్లినిక్స్..
 పెద్ద ఆసుపత్రులతోపాటు 85 క్లినిక్స్‌ను అపోలో నిర్వహిస్తోంది. 3,000-9,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ క్లినిక్స్‌లో ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉంటారు. వ్యాధి పరీక్షలు, 24 గంటల ఫార్మసీ వంటి సౌకర్యాలుంటాయి. ఏడాదిన్నరలో క్లినిక్స్ సంఖ్య 100కుపైగా దాటుతుందని సంగీతరెడ్డి చెప్పారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన అపోలో షుగర్ క్లినిక్స్ విస్తరణలో సనోఫి చేతులు కలపనుందని వెల్లడించారు. అపోలో షుగర్ క్లినిక్స్‌లో ఔషధ తయారీ సంస్థ సనోఫి-సింథెలాబొ 20% వాటాను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 ఈసీజీ మరింత ఈజీ..
 మొబైల్ ఈసీజీ (ఎలక్ట్రో కార్డియోగ్రఫీ) పరికరాన్ని భారత్‌లో మార్కెట్ చేసేందుకు అపోలో హాస్పిటల్స్‌తో ఆలివ్‌కోర్ చేతులు కలిపింది. ఐఓఎస్, ఆన్‌డ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఆలివ్‌కోర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరికరాన్ని ఫోన్‌కు వెనుకవైపు అతికి ంచాలి. నిర్దేశిత ప్రాంతంలో చేతివేళ్లను ఉంచితే చాలు కొన్ని సెకన్లలో మొబైల్ స్క్రీన్‌పై ఈసీజీ రిపోర్టు ప్రత్యక్షమవుతుంది. రిపోర్టును ఇ-మెయిల్ ద్వారా వైద్యుడికి పంపించొచ్చు. అపోలో వైద్యులతో అనుసంధాన సేవలు కావాలంటే నెలకు రూ.1,000 చార్జీ ఉంటుంది.

గుండెపోటు సమస్యను ముందే గుర్తించేందుకు ఈ పరికరంతో వీలవుతుందని అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. పరికరం ఖరీదు రూ.12 వేలు. అపోలో ఫార్మసీతోపాటు త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లోనూ లభించనుంది. దీన్ని మార్కెట్ చేసేందుకు ముందుకొచ్చే పెద్ద సంస్థలతో భాగస్వామ్యానికి  సిద్ధమని ఆలివ్‌కోర్ సీఈవో యువాన్ థామ్సన్ చెప్పారు.

>
మరిన్ని వార్తలు