అపోలో వైజాగ్ ఆసుపత్రి డిసెంబర్‌లోగా ప్రారంభం

25 Jul, 2014 00:49 IST|Sakshi
అపోలో వైజాగ్ ఆసుపత్రి డిసెంబర్‌లోగా ప్రారంభం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రి ఈ ఏడాది డిసెంబర్‌లోగా ప్రారంభం కానుంది. 250 పడకలతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్‌లో సంస్థకు ఆసుపత్రి ఉంది. నూతన ఆసుపత్రికి రూ.100 కోట్ల వ్యయం చేస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి చెప్పారు.

గురువారం నాడిక్కడ మీడియా సమావేశానంతరం ఆమె  సాక్షి బిజినెస్ బ్యూరోకు పై విషయం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో కూడా రూ.100 కోట్లతో 250 పడకల అత్యాధునిక ఆసుపత్రి నెలకొల్పుతామని పేర్కొన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసేదీ ప్రకటించగానే పనులను ప్రారంభించేందుకు సిద్ధమని వెల్లడించారు. కరీంనగర్, కాకినాడ ఆసుపత్రుల్లో కేన్సర్ చికిత్స సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

 జన్యు పరీక్షలతో..
 అపోలో అనుబంధ కంపెనీ సెపియన్ బయోసెన్సైస్, బెంగళూరుకు చెందిన స్ట్రాండ్ లైఫ్ సెన్సైస్‌తో చేతులు కలిపింది. జన్యు ఆధారిత అత్యాధునిక పరీక్షల ద్వారా రోగులకు వ్యక్తిగత ఔషధాలను సూచించేందుకు వైద్యులకు ఈ భాగస్వామ్యం వీలు కల్పిస్తుందని స్ట్రాండ్ లైఫ్ సెన్సైస్ చైర్మన్ విజయ్ చంద్రు తెలిపారు. చికిత్సనుబట్టి పరీక్షలకు వ్యయం రూ.15 వేల నుంచి మొదలవుతుందన్నారు.

 కేన్సర్, హృదయ, వారసత్వ కంటి జబ్బులు, జన్యుపర రుగ్మతల చికిత్సలకు ఈ పరీక్షలు జరుపుతారు. జన్యులోపం ఎక్కడుందో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని సంగీత రెడ్డి తెలిపారు. రోగి కుటుంబీకులు సైతం పరీక్షలు చేయించుకుంటే సమస్యలను ముందస్తుగా గుర్తించొచ్చని సూచించారు. పుట్టిన పిల్లలకు జన్యు పరీక్షలు చేసి ఆ వివరాలను భద్రపరిస్తే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు వేగవంతమైన పరిష్కారం లభిస్తుందన్నారు. జన్యు పరీక్షలను ప్రభుత్వ కార్యక్రమం కింద చేపట్టాల్సిందిగా కేంద్రాన్ని చాన్నాళ్లుగా కోరుతున్నామని తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు