వైద్యానికి రూ.4 లక్షల వరకు రుణం

22 Jan, 2020 03:55 IST|Sakshi

ఏడాదిలో తిరిగి చెల్లించే అవకాశం

అపోలో– బజాజ్‌ భాగస్వామ్యం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్, ఆర్థిక సేవల సంస్థ బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి అపోలో హాస్పిటల్స్‌–బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ హెల్త్‌ ఈఎంఐ కార్డును ప్రవేశపెట్టాయి. వైద్య సేవలకు అయిన వ్యయాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించేందుకు ఈ కార్డు వీలు కల్పిస్తుంది. ఆసుపత్రిలో ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. రూ.4 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. 12 నెలల్లో ఈ మొత్తాన్ని బజాజ్‌ ఫిన్‌సర్వ్‌కు వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది. కార్డుదారుకు పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీతోపాటు డిస్కౌంట్‌ వోచర్స్, కూపన్స్‌ ఆఫర్‌ చేస్తారు.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, క్యాన్సల్డ్‌ చెక్కు సమర్పించి ఈ కార్డు పొందవచ్చు. ఒప్పందం నేపథ్యంలో అపోలో ఆసుపత్రుల్లో ప్రత్యేక కౌంటర్లను బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఏర్పాటు చేయనుంది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి, ఎండీ సునీతా రెడ్డి, బజాజ్‌ ఫైనాన్స్‌ ఎండీ రాజీవ్‌ జైన్, ఇరు సంస్థల ప్రతినిధులు ఈ కార్డును ఆవిష్కరించారు. కాగా, అపోలో టెలిహెల్త్‌ సర్వీసెస్‌ మలేషియాలో ఈ ఏడాది డిసెంబరు నాటికి 100 టెలి క్లినిక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు టెలిహెల్త్‌కేర్‌ మలేషియాలో ఒప్పందం చేసుకుంది.

మరిన్ని వార్తలు