పునర్వ్యవస్థీకరణపైఅపోలో హాస్పిటల్స్ దృష్టి

2 Sep, 2016 01:22 IST|Sakshi
పునర్వ్యవస్థీకరణపైఅపోలో హాస్పిటల్స్ దృష్టి

18 శాతం క్షీణించిన నికరలాభం
జీఎస్‌టీతో హెల్త్‌కేర్ వృద్ధి: ప్రతాప్ సి.రెడ్డి
 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  నిర్వహణ సామర్ధ్యాన్ని మెరుగుపర్చుకుని మరింత వృద్ధి సాధించడంపై అపోలో హాస్పిటల్స్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వ్యాపార విభాగాలను పునర్‌వ్యవస్థీకరించేందుకు కసరత్తు ప్రారంభించింది. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి పలు ప్రతిపాదనలు, అవకాశాలను కంపెనీ బోర్డు పరిశీలించినట్లు అపోలో హాస్పిటల్స్ గురువారం వెల్లడించింది. పునర్‌వ్యవస్థీకరణ అమలుకు తగు మార్గదర్శ ప్రణాళికను రూపొందించే బాధ్యతలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రీస్ట్రక్చరింగ్ కమిటీకి బోర్డు అప్పగించినట్లు వివరించింది. శోభన కామినేని, సంజయ్ నాయర్, ఎన్ వాఘుల్ తదితర డెరైక్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారని సంస్థ పేర్కొంది.

 తగ్గిన నికర లాభం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ నికర లాభం సుమారు 18 శాతం క్షీణించి రూ. 72.5 కోట్లకు తగ్గింది. అంతక్రితం క్యూ1లో ఇది రూ. 87.5 కోట్లు. మరోవైపు, మొత్తం ఆదాయం మాత్రం 12 శాతం వృద్ధితో రూ. 1,306 కోట్ల నుంచి రూ. 1,465 కోట్లకు పెరిగింది. విభాగాల వారీగా చూస్తే .. హెల్త్ కేర్ సేవల ద్వారా ఆదాయం సుమారు ఆరు శాతం వృద్ధితో రూ. 833 కోట్లకు చేరగా, ఫార్మసీ విభాగం ఆదాయం 22 శాతం పెరిగి రూ. 632 కోట్లుగా నమోదైంది.

క్యూ1లో స్టాండెలోన్ ఫార్మసీల విభాగంలో కొత్తగా 57 స్టోర్స్ ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం 8 క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉండగా రాబోయే రోజుల్లో కొత్తగా మరో రెండు ఇన్‌స్టిట్యూట్‌లను (భువనేశ్వర్, ముంబైలలో) ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. ప్రతిపాదిత వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం హెల్త్‌కేర్ రంగ వృద్ధికి దోహదపడగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు