శాంసంగ్‌, ఎల్‌జీలకు షాకింగ్‌ న్యూస్‌

19 Mar, 2018 11:47 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో:  డిస్‌ ప్లే మార్కెట్‌ లీడర్లు శాంసంగ్‌, ఎల్‌జీలకు షాకింగ్‌ న్యూస్‌. మొబైల్‌ దిగ్గజం  ఆపిల్‌ సొంతంగా తన సొంత స్క్రీన్లను  తయారు చేసుకుంటోందట.  కాలిఫోర్నియా లోని తన  ప్రధాన కార్యాలయం సమీపంలో సొంత డివైస్‌ స్క్రీన్ల డిజైనింగ్‌, ఉత్పత్తిని రహస్యంగా చేపట్టిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  అంతేకాదు  చిన్నమొత్తంగా స్క్రీన్లను రూపొందించి టెస్టింగ్‌ కూడా నిర్వహిస్తోందట. ఇందుకు ఒక సీక్రెట్‌ ప్రాజెక్టును రూపొందించిందనీ, ఈ మేరకు ఆపిల్‌ గణనీయమైన పెట్టుబడులు పెట్టిందని సోమవారం బ్లూంబర్గ్‌ నివేదించింది.

తన సొంత డిస్‌ప్లే ఉత్పత్తులపై దృష్టిపెట్టిన ఆపిల్‌ మైక్రోఎల్‌ఈడీ స్క్రీన్లను డెవలప్‌ చేస్తోందని  నివేదించింది.  కాలిఫోర్నియాలోని 62వేల  చదరపు అడుగుల తయారీ కేంద్రాన్ని ఇందుకు కేటాయించిందట. ఈ రహస్య ప్రాజెక్ట్ కోడ్ పేరు టీ159 అని, ఐఫోన్,ఆపిల్ వాచ్ స్క్రీన్ టెక్నాలజీ బాధ్యుడు లిన్ యంగ్స్ ఈ ప్రాజెక్టను పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది.  మైక్రోఎల్‌ఈడీ స్క్రీన్స్‌.. ప్రస్తుత ఓఎల్‌ఈడీలతో పోలిస్తే వివిధ కాంతి-ఉద్గారసమ్మేళనాల మిళితంగా పనిచేస్తాయి. అందుకే తమ భవిష్యత్ గాడ్జెట్లు మరింత స్లిమ్‌గా, ప్రకాశవంతంగా,  విద్యుత్‌ను తక్కువగా వినియోగించుకునేలా వీటిని  రూపొందిస్తోందని చెప్పింది.  2019లో లాంచే చేసే అన్ని ఐఫోన్లకు ఈ  డిస్‌ప్లేలను జోడించనుందని కూడా అంచనా వేసింది.

కాగా ఐఫోన్ ఎక్స్‌ లాంటి కీలక డివైస్‌లకు  ఎల్‌ఈడీ డిస్‌ప్లేలకు  పెట్టింది పేరైన  శాంసంగ్ డిస్‌ప్లే  ప్యానెళ్లపైనే ఆధారపడింది. మరోవైపు ఇటీవీల ఓఎల్‌ఈడీ స్క్రీన్ల సరఫరాపై ఎల్‌జీతో  చర్చలు జరుపుతోందని,  త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుందని  నివేదికలు వచ్చాయి.   మరి తాజా అంచనాలపై ఆపిల్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు