ఇక చౌకగా ఐఫోన్‌ 6ఎస్‌

28 Jun, 2018 11:56 IST|Sakshi
ఐఫోన్‌ 6ఎస్‌ (ఫైల్‌ ఫోటో)

ఆపిల్‌ ఐఫోన్‌ అంటేనే.. కాస్త ఖరీదెక్కువ. ఆ ఫోన్‌ చేతిలో ఉందంటే, ఓ స్థాయిగా ఫీలవుతారు. సాధారణ మొబైల్స్‌తో పోలిస్తే ఐఫోన్‌ ధరలు ఎక్కువగా ఉండటానికి గల కారణం మనదేశంలో అమలవుతున్న అత్యధిక దిగుమతి సుంకాలే. ఈ సుంకాల బారి నుంచి తప్పించుకోవడానికి మెల్లమెల్లగా ఆపిల్‌ భారత్‌లోనే తమ ఐఫోన్ల ఉత్పత్తిని చేపడుతోంది. గతేడాది నుంచే ఆపిల్‌ భారత్‌లో తన ఐఫోన్‌ ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడం ప్రారంభించింది. బెంగళూరులో ఈ తయారీ సౌకర్యాన్ని ఏర్పరిచింది. తాజాగా కొత్త ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కూడా భారత్‌లోనే రూపొందించడం ప్రారంభించిందని తెలిసింది. అదీ కూడా బెంగళూరులోని ఐఫోన్‌ ఎస్‌ఈ రూపొందే విస్ట్రోన్‌ ప్లాంట్‌లోనే ఐఫోన్‌ 6 ఎస్‌ను ఆపిల్‌ తయారు చేస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి. భారత మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా అమ్ముడుపోతుండటంతో, ఐఫోన్‌ 6ఎస్‌ ఉత్పత్తినే ఇక్కడ ప్రారంభించాలని ఆపిల్‌ నిర్ణయించిందని తెలిసింది. 

దీంతో ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌పై దిగుమతి సుంకాలు తగ్గిపోతాయి. ఈ సుంకాలు తగ్గిపోవడంతో, ఐఫోన్‌ 6ఎస్‌ చౌకైన ధరలో భారత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి. మిడ్‌-రేంజ్‌ ప్రీమియం సెగ్మెంట్‌లోకి కొంత షేర్‌ను విస్తరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపాయి. ‘ఐఫోన్‌ ఎస్‌ఈ మాదిరి మేడిన్‌ ఇండియాలో రూపొందుతున్న ఐఫోన్‌ 6ఎస్‌ను భారత్‌లోనే విక్రయిస్తాం. భారత్‌లో తయారీ సామర్థ్యం పెరిగేంత వరకు ఐఫోన్‌ 6ఎస్‌ దిగుమతులు కొనసాగిస్తాం. స్థానిక తయారీ యూనిట్లతో ఎలాంటి ధర కరెక్షన్‌ ఉండదు. త్వరలోనే మేడిన్‌ ఇండియా ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోర్లలోకి వస్తుంది’ అని ఆపిల్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. ఐఫోన్‌ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు, మొత్తం భారత్‌లో ఐఫోన్‌ అ‍మ్మకాల్లో మూడో వంతు స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. ధరలో స్థిరత్వం, పోటీ కోసం కంపెనీ స్థానికంగా తయారీ యూనిట్లను పెంచుతున్నామని ఆపిల్‌ వివరించింది. 

మరిన్ని వార్తలు