ఆ బాధను కళ్లారా చూశా.. అందుకే

6 Jul, 2016 15:34 IST|Sakshi
ఆ బాధను కళ్లారా చూశా.. అందుకే ఈ యాప్

లక్షలమంది ఐ ఫోన్ యూజర్లను అవయవ దానానికి ప్రోత్సహించడానికి యాపిల్ కొత్త సాప్ట్ వేర్ ను తీసుకొచ్చింది. అవయవ దానాన్ని తేలికగా చేయడానికి యాపిల్ తన హెల్త్ యాప్ సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేసింది. అప్ డేట్ చేసిన ఈ హెల్త్ యాప్ ను ఐఓఎస్ 10 యూజర్లందరికీ అందుబాటులో ఉంచనుంది. ఈజీ సైన్-అప్ బటన్ తో ఆర్గాన్ లు డొనేట్ చేసేలా కంపెనీ ఆ యాప్ ను రూపొందించింది. ఈ నెలలో లిమిటెడ్ గా ఈ కొత్త సాప్ట్ వేర్ ను యాపిల్ విడుదల చేయనుంది.

దీర్ఘకాలంగా కొనసాగుతున్న అవయవ దాత కొరత ఇబ్బందిని, ఈ యాప్ ద్వారా యాపిల్ తగ్గించగలదని కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన స్నేహితుడు, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, 2009లో లివర్ మార్పిడికి, అవయవం దొరకక ఎంతో బాధను భరించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన స్నేహితుడు ఎంతగా బాధపడ్డాడో కళ్లారా చూశానని, ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని కుక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను లివర్  దానం చేస్తానన్న స్టీవ్ జాబ్స్ అంగీకరించలేదని తెలిపారు.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో 2011లో జాబ్స్ చనిపోయారని, సరియైన సమయానికి అవయవ దాత దొరకక ఇబ్బందిపడుతున్న వారికి ఈ యాప్ ఎంతో సహకరించగలదని టిమ్ కుక్ చెప్పారు. ఆన్ లైన్ లావాదేవీలన్నింటికీ స్మార్ట్ ఫోన్లు వాడే యువతకు, ఈ కొత్త సైన్-అప్ విధానంతో అవయవాలు దానం చేయడం కూడా సులభతరం అవుతుందని అన్నారు.

2014లో యాపిల్ ఐఫోన్ యూజర్లకు హెల్త్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ టూల్ తో యూజర్ల హెల్త్, ఫిట్ నెస్ డేటాను రికార్డు చేసుకునేలా పొందుపరిచింది. అయితే ప్రస్తుతం అప్ డేట్ చేసిన ఈ యాప్ తో, ఆర్గాన్ డొనేషన్ సమాచారం కూడా అందుబాటులోకి రానుంది. అవయవ దాతగా నమోదు చేసుకున్న యూజర్ల సమాచారం, డొనేట్ లైఫ్ అమెరికాను నిర్వహిస్తున్న నేషనల్ డొనేట్ రిజస్ట్రీకి వెళ్తుంది.

ఎవరికైనా అవయవం కావాల్సి వస్తే, ఫోన్ లాక్ లో ఉన్నా సరే ఎమర్జెన్సీ సమాచారంగా ఫోన్ పై డిస్ ప్లే అవుతుంది. ప్రస్తుతం డెవలపర్స్ బీటా ఐఓఎస్ 10 యూజర్లకు అందుబాటులో ఉంటుంది. దీన్ని మరింత వ్యాప్తి చేయడానికి కొత్త ఐఓఎస్ వెర్షన్ కంపెనీ ఆవిష్కరించనుంది. అమెరికాలో 12వేలకు పైగా ప్రజలు తమ ప్రాణ రక్షణ కోసం అవయవదానానికి వేచిచూస్తున్నారు. వారిలో అవయవం అందక రోజుకు సగటున 22 మంది చనిపోతున్నారు.

మరిన్ని వార్తలు