ఆపిల్‌ ఫ్రీగా బ్యాటరీ రిప్లేస్‌మెంట్‌

21 Apr, 2018 16:01 IST|Sakshi
ఆపిల్‌ కంపెనీ లోగో (ఫైల్‌ ఫోటో)

బ్యాటరీ ఫెయిల్యూర్‌ సమస్యలతో టెక్‌ దిగ్గజం ఆపిల్‌ సైతం సతమతమవుతోంది. ఇటీవల ఐఫోన్‌ ఫోన్ల బ్యాటరీని స్లో చేస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తగా.. తాజాగా మ్యాక్‌బుక్‌ ప్రొ డివైజ్‌ల బ్యాటరీల్లో కూడా సమస్యలు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మ్యాక్‌బుక్‌ ప్రొల బ్యాటరీలను ఉచితంగా రీప్లేస్‌ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రీప్లేస్‌మెంట్‌ను ఆపిల్‌ చేపడుతోంది. టచ్‌ బార్స్‌ లేని కొన్ని 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రొల్లో పొరపాటును గుర్తించినట్టు ఆపిల్‌ తెలిపింది. 2016 అక్టోబర్‌ నుంచి 2017 అక్టోబర్‌ మధ్యలో తయారు చేసిన యూనిట్లు బ్యాటరీ సమస్యల బారిన పడ్డాయని ఆపిల్‌ తన సపోర్టు పేజీలో పేర్కొంది. కానీ ఎన్ని మ్యాక్‌బుక్‌లు దీని బారిన పడ్డాయో తెలుపలేదు. కొత్త బ్యాటరీలను వాటిలో రీప్లేస్‌ చేస్తామని, వాటిని ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. 

యూజర్లు తమ మ్యాక్‌బుక్‌ సీరియల్‌ నెంబర్‌ను సపోర్టు పేజీలో నమోదు చేస్తే, తమ యూనిట్‌ రీప్లేస్‌ చేసుకోవాలో లేదో తెలుస్తుంది. ఒకవేళ తమ ల్యాప్‌టాప్‌లు బ్యాటరీ సమస్య బారిన పడినట్టు తెలిస్తే, వెంటనే ఆపిల్‌ రిఫైర్‌ సెంటర్‌, ఆపిల్‌ రిటైల్‌ స్టోర్‌, ఆపిల్‌ అధికారిక సర్వీసు ప్రొవైడర్‌ను ఆశ్రయించాలని సూచించింది. ఇప్పటికే బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ కోసం డబ్బులు కట్టిన వారికి, ఈ నగదును కంపెనీ తిరిగి రీఫండ్‌ చేయనుంది. అయితే టచ్‌బార్‌తో ఉన్న మ్యాక్‌బుక్‌ ప్రొలు, 13 అంగుళాల పాత మ్యాక్‌బుక్‌ ప్రొ మోడల్స్‌ దీని బారిని పడలేదు. అంతకముందు ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్స్‌ బ్యాటరీలను ఆపిల్‌ స్లో చేసిందని తెలువడంతో, ఆ విషయంపై కంపెనీ క్షమాపణ చెప్పింది. వెంటనే వాటి బ్యాటరీల రిప్లేస్‌మెంట్‌లను అ‍త్యంత తక్కువ ధరకు చేపట్టింది. 

మరిన్ని వార్తలు