♦ యూరోపియన్ కమిషన్ స్పష్టీకరణ
♦ 13 బిలియన్ యూరోల పన్ను చెల్లించాలని ఆదేశం
♦ ఐర్లాండ్‌తో ఒప్పందాల మాటున
♦ పన్ను ఎగవేతలకు పాల్పడుతోందని ఆరోపణ
♦ తీర్పుపై అప్పీలుకు వెళ్తామన్న ఐర్లాండ్
♦ యాపిల్ కూడా సవాలు చేసే అవకాశం
బ్రసెల్స్: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) గట్టి షాకిచ్చింది. ఐర్లాండ్‌తో ఒప్పందాలు చేసుకుని, తద్వారా అంతర్జాతీయ అమ్మకాల్లో చాలావరకూ అక్కడి నుంచే చేస్తున్న యాపిల్... ఈ చర్యలతో కొన్నేళ్లుగా పన్నులను ఎగ్గొడుతూ వస్తోందని, ఇది చట్ట విరుద్ధమని యూరోపియన్ కమిషన్ తేల్చిచెప్పింది. ఇందుకుగాను 13 బిలియన్ యూరోలను (దాదాపు రూ. లక్ష కోట్లు) తిరిగి చెల్లించాలని స్పష్టంచేసింది. అక్రమంగా యాపిల్‌కు పన్ను ప్రయోజనాలు కట్టబెట్టిన ఐర్లాండ్... ఈ సొమ్మును రికవరీ చేసుకోవాలని ఈసీ ఆదేశించింది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా పేరొందిన యాపిల్... ఐర్లాండ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ప్రత్యేక అవగాహనల ఆధారంగా యూరప్‌లో దాదాపు తన వ్యాపార లాభాలన్నింటిపైనా పన్నులను ఎగ్గొంట్టిందని ఈసీ తన తీర్పులో పేర్కొంది.
అమెరికాలోని బహుళజాతి దిగ్గజాలను ఆకర్షించటం కోసం ఐర్లాండ్ చాలా ఏళ్లుగా ఇష్టానుసారం పన్ను ప్రోత్సాహకాలనిస్తోంది. వీటినే ‘స్వీట్ హార్ట్’ డీల్స్‌గా వ్యవహరిస్తున్నారు. చట్టవ్యతిరేకంగా యాపిల్‌కు ఐర్లాండ్ ప్రభుత్వం పన్ను ప్రయోజనాలను కల్పిస్తోందని కమిషన్ తన విచారణలో నిగ్గుతేల్చింది. ‘‘ఈ డీల్స్ కారణంగా యాపిల్ యూరప్‌వ్యాప్తంగా తన ఇతర వ్యాపారాల్లో కూడా అనేక ఏళ్లుగా అత్యంత తక్కువ పన్నును చెల్లిస్తోంది. 2003లో చూస్తే యాపిల్ తన యూరప్ లాభాల్లో 1 శాతాన్ని పన్ను రూపంలో చెల్లించింది. కానీ 2014కు వచ్చేసరికి ఈ స్వీట్హార్ట్ డీల్స్ కారణంగా ఈ శాతం జీరో స్థాయికి (0.005%) పడిపోయింది’’ అని ఈయూ కాంపిటీషన్ కమిషనర్ మార్గ్రీత్ వెస్టాజర్ పేర్కొన్నారు.
వ్యతిరేకిస్తున్నాం... ఐర్లాండ్: ఈసీ ఆదేశాలపై ఐర్లాండ్ వెంటనే స్పందించింది. తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. ‘కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. కేబినెట్ ఆమోదం తీసుకొని యూరోపియన్ కోర్టుల్లో ఈ తీర్పుపై అప్పీలు చేయడం మినహా మరో మార్గం లేదు’ అని ఐర్లాండ్ ఆర్థిక మంత్రి మైఖేల్ నూనన్ పేర్కొన్నారు. ఐర్లాండ్ కల్పిస్తున్న పన్ను ప్రయోజనాలు చట్టవిరుద్ధమన్న ఆరోపణలపై ఈయూ మూడేళ్లుగా విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
ఈయూపై అమెరికా ఫైర్...: యాపిల్‌తోపాటు తమ ఇతర బహుళజాతి కంపెనీలపై పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి ఈసీ చేపడుతున్న విచారణను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈసీ ఏకపక్షంగా వ్యవహరించడంతోపాటు తన అధికారాలను అతిక్రమిస్తోందని గతవారంలో అమెరికా ఆర్థిక శాఖ తీవ్రంగా స్పందించడం గమనార్హం.
ఈసీ తీర్పు నిరాధారం: కుక్
ఈసీ తీర్పు ప్రభావం యూరప్‌లోని పెట్టుబడులు, ఉద్యోగాలపై ఎక్కువగానే ఉంటుందని యాపిల్ సంస్థ ఒకరకంగా హెచ్చరించింది. ఐర్లాండ్ నుంచి తాము చట్టవిరుద్ధంగా పన్ను ప్రయోజనాలు పొందామన్న తీర్పు నిరాధారమైనదని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. ఐర్లాండ్‌కు 13 బిలియన్ యూరోలను చెల్లించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కుక్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ యూరోపియన్ కస్టమర్లకు మంగళవారం ఒక లేఖ రాశారు.
‘మేం ప్రత్యేక ఒప్పందాల పేరుతో ఎలాంటి ప్రయోజనాలూ కోరలేదు. అందుకోలేదు కూడా. కమిషన్ తీర్పునకు చట్టప్రకారం ఎలాంటి ఆధారాల్లేవు’ అని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 13న వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుక్ మాట్లాడుతూ... కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ అలాకాని పక్షంలో తప్పకుండా తీర్పును సవాలు చేస్తామని కూడా ఆయన అప్పుడే చెప్పడం గమనార్హం.
లక్ష కోట్లు వస్తుంటే... ఐర్లాండ్ ఎందుకు వద్దంటోంది?
ఐర్లాండ్‌కు పన్ను రూపంలో రూ.లక్ష కోట్లు చెల్లించాలని యాపిల్‌ను ఈసీ ఆదేశించింది. నిజానికి ఈ డబ్బు ఐర్లాండ్‌కు 2015లో వచ్చిన మొత్తం కార్పొరేట్ పన్నులకు రెట్టింపు. ఒక ఏడాది ఆరోగ్య బడ్జెట్. లేదంటే లక్ష ఇళ్లు కట్టించొచ్చు. కానీ ఐర్లాండ్ ప్రభుత్వం వద్దంటోంది!! ఈసీ తీర్పును కోర్టులో సవాలు చేస్తామంటోంది. ఐర్లాండ్ విపక్షం మటుకు ఆ డబ్బును తీసుకోవాల్సిందేనంటోంది. ఎందుకిదంతా?
ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఐర్లాండ్ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. అక్కడ పన్నులు 12.5 శాతం మాత్రమే. అందుకే గూగుల్, ఫేస్బుక్ వంటి దిగ్గజాలతో పాటు 700కు పైగా అమెరికన్ కంపెనీలు ఐర్లాండ్‌లో కొలువుతీరాయి. 1.4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాయి. ఆరేళ్ల కిందట ఐర్లాండ్ సంక్షోభంలో పడి... అంతర్జాతీయ బెయిలవుట్ ప్యాకేజీ అడగాల్సి వచ్చినపుడు కూడా... పన్నులు పెంచటానికి అక్కడి ప్రభుత్వం అంగీకరించలేదు. ‘‘పన్నులు వెనక్కి తీసుకోవటమంటే... బంగారు గుడ్లుపెట్టే కోడిని కోసేసినట్లే’’ అన్నది ఐరిష్ ఆర్థికమంత్రి మైఖేల్ నూనన్ అభిప్రాయం.
ఈ కేసులో తాము ఓడిపోతే భవిష్యత్తు తరాలు దెబ్బతింటాయన్నది ఆయన మాట. అదే యాపిల్ విషయానికొస్తే... దాని దగ్గరున్న భారీ నగదు నిల్వలతో పోలిస్తే ఈ జరిమానా లెక్కే కాదు. ప్రస్తుతం యాపిల్ వద్ద 232 బిలియన్ డాలర్లకుపైగా నగదు నిల్వలున్నాయి. ఇంకో విషయమేంటంటే... ఐర్లాండ్ ఒకవేళ ఈ డబ్బులు తీసుకున్నా దాన్ని దేశంలో కార్యక్రమాలకు ఖర్చు పెట్టడానికి లేదు. దాని అప్పులు తీర్చడానికి వాడా లి. ఇప్పుడు ఐర్లాండ్‌కు 180 బిలియన్ డాలర్ల రుణాలు ఉన్నాయి.
ఇదీ.. అసలు సమస్య
ఐర్లాండ్‌లోని కార్క్ సిటీ కేంద్రంగా యాపిల్ సంస్థ 1980 నుంచీ తన యూరప్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అక్కడ కంపెనీకి 5,000 మంది ఉద్యోగులున్నారు. అయితే, యాపిల్ తన అంతర్జాతీయ అమ్మకాలను ఐర్లాండ్ కేంద్రం నుంచి మళ్లించడం ద్వారా బిలియన్ల డాలర్ల కొద్దీ కార్పొరేట్ పన్నులను తప్పించుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై యూరోపియన్ కమిషన్ దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు జరిపింది. వాస్తవానికి ‘లక్స్‌లీక్స్’ స్కామ్ వెలుగులోకి వచ్చాక ఈయూ ఈ పన్ను ఎగవేతల అంశంపై తీవ్రంగా దృష్టిపెట్టింది.
ప్రస్తుత ఈసీ ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ జంకెర్.... : గతంలో లగ్జెంబర్గ్ ప్రధానిగా ఉన్నప్పుడు కంపెనీలకు భారీస్థాయిలో పన్ను రాయితీలను ఇచ్చారన్నది ఈ స్కామ్‌లో ప్రధానాంశం. కాగా, ఇవే ఆరోపణలపై అమెరికా కాఫీ చెయిన్ స్టార్‌బక్స్, ఇటాలియన్ వాహన దిగ్గజం ఫియట్... నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్లకు చెరో 3.4 కోట్ల డాలర్ల విలువైన పన్నులను తిరిగి చెల్లించాలంటూ ఈసీ గతేడాది ఆదేశించింది కూడా. తమ కంపెనీలు కుదుర్చుకున్న డీల్స్.. అంతర్జాతీయ ఒప్పందాలు, పన్ను విధానాలకు అనుగుణంగానే ఉన్నాయనేది అమెరికా వాదన.