ఐఫోన్ల నుంచి టన్ను బంగారం..

16 Apr, 2016 11:35 IST|Sakshi
ఐఫోన్ల నుంచి టన్ను బంగారం..

ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు బంగారం కావాలంటే ఏం చేస్తారు.. కొనుకుంటారా! లేకపోతే అద్దెకు తీసుకొస్తారా!  అంటే యాపిల్ సంస్థ మాత్రం పాత గాడ్జెట్లను, ఫోన్లను రీసైక్లింగ్ చేసి, బంగారాన్ని తీసుకుంటుందట. ఎక్కువగా పాత ఐఫోన్ల ద్వారా ఈ బంగారం రాబట్టుకుంటుందని  కంపెనీ తెలిపింది. సగటున ఒకో ఐఫోన్ తయారీలో ౩౦ మిల్లీగ్రాముల బంగారం ఉపయోగిస్తారు. గత ఏడాది ఇలా దాదాపు 2,204 పౌండ్ల(టన్ను కంటే ఎక్కువ) బంగారాన్ని ఐపోన్లను, ఐపాడ్లను, ఐమాక్లను పగలగొట్టి రీసైక్లింగ్ చేసుకుందని కంపెనీ వార్షిక పర్యావరణ రిపోర్టులో తెలిపింది. వీటి విలువ దాదాపు 40 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

అసలు యాపిల్ కు బంగారం ఎందుకు అవసరం అవుతుందనే సందేహం కూడా రావచ్చు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులో బంగారానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ఉత్పత్తులు తుప్పు పట్టకుండా, ఎక్కువ కాలం పనిచేసేలా, అద్భుతమైన విద్యుత్ వాహకంలా బంగారం ఉపయోగపడుతుంది. వెండిని, రాగిని కూడా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో వాడతారు. అయితే అవి త్వరగా తుప్పుపట్టి, పాడయ్యే అవకాశాలు అధికంగా ఉండటం, అతిముఖ్యమైన సమయంలో ఎలక్ట్రాన్లను మెల్లగా ప్రయాణించేలా చేయడం వల్ల వీటిని గాడ్జెట్లలో తక్కువగా వాడతారు.  

90 మిలియన్ పౌండ్ల ఈ-వేస్ట్ ను రీసైక్లింగ్ ప్రొగ్రామ్స్ ద్వారానే చేపడతామని, పునర్వినియోగ పదార్థాల నుంచి 61 మిలియన్లు రాబట్టుకున్నామని యాపిల్ సంస్థ తెలిపింది. పాత గాడ్జెట్ల నుంచి తీసుకున్న అతి ముఖ్యమైన పదార్థంలో బంగారం ఒకటని పేర్కొంది. అదేవిధంగా 23 మిలియన్ పౌండ్ల ఉక్కును, 13 మిలియన్ పౌండ్ల ప్లాస్టిక్ ను, 12 మిలియన్ పౌండ్ల గ్లాస్ ను, 4.5 మిలియన్ పౌండ్ల అల్యూమినియంను, 3 మిలియన్ పౌండ్ల కాపర్ ను, 6,600 పౌండ్ల సిల్వర్ ను రీసైక్లింగ్ ద్వారా రాబట్టుకున్నామని వెల్లడించింది. తాము  చేపడుతున్న ఈ రీసైక్లింగ్ ప్రొగ్రామ్స్ ద్వారా, భూమి, గనుల నుంచి అవసరమైన లోహాలను తీసుకునే అవసరం తగ్గుతుందని యాపిల్ పేర్కొంది.

మరిన్ని వార్తలు