భారత్‌ మాకు కీలకం

4 May, 2017 00:30 IST|Sakshi
భారత్‌ మాకు కీలకం

ముంబై: అపార అవకాశాలున్న భారత మార్కెట్‌ తమకు కీలకమని టెక్‌ దిగ్గజాలు యాపిల్, ఎడోబ్‌  పేర్కొన్నాయి. తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి 30 శాతం సిబ్బంది భారత్‌లోనే ఉన్నారని ఎడోబ్‌ గ్లోబల్‌ చైర్మన్, సీఈవో శంతను నారాయణ్‌ బుధవారంనాడిక్కడ మీడియాకు తెలిపారు. నోయిడా, బెంగళూరు తదితర మూడు కేంద్రాల్లో సుమారు 4,200 మంది ఉద్యోగులు ఉన్నారని.. ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బం ది సంఖ్యలో ఇది నాలుగో వంతు అని బుధవారం  ఆయన విలేకరులకు చెప్పారు.

ఎడోబ్‌ ప్రతి ఉత్పత్తిలో భారత సిబ్బంది వాటా ఎంతో కొంత ఉంటుందన్నారు. భారత్‌ను కేవలం తమ ఉత్పత్తుల విక్రయానికి మార్కెట్‌గా మాత్రమే పరిగణించడం లేదని, వినూత్న ఉత్పత్తుల రూపకల్పన కోసం ఇన్నోవేషన్‌ హబ్‌గా తాము భావిస్తామని నారాయణ్‌ పేర్కొన్నారు.

అమెరికా కంపెనీల్లో విదేశీ నిపుణుల నియామకాలు, కార్యకలాపాల ఔట్‌సోర్సింగ్‌ను వ్యతిరేకిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వీసా నిబంధనలు కఠినతరం చేయడం వంటి రక్షణాత్మక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నారాయణ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, భారత మార్కెట్లో పైరసీ సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని నారాయణ్‌ చెప్పారు.

దేశీ మార్కెట్‌పై యాపిల్‌ దృష్టి..
న్యూయార్క్‌: అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత మార్కెట్లో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవడంపైనా, స్థానం పటిష్టం చేసుకోవడంపైనా దృష్టి పెడుతున్నట్లు యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు. కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా ఆయన కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాట్లాడుతూ భారత మార్కెట్లో తమ కార్యకలాపాలు ఇంకా పూర్తిగా విస్తరించాల్సి ఉందన్నారు.  మార్చి క్వార్టర్‌లో భారత్‌లో తాము రికార్డు స్థాయి అమ్మకాలు సాధించామని, ఆదాయం రెండంకెల స్థాయిలో వృద్ధి చెందిందని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా న్యూయార్క్‌లో ఆయన వివరించారు.

భారత్‌లో 4జీ నెట్‌వర్క్‌ విస్తరణ మిగతా ఏ దేశంలోనూ లేనంత వేగంగా జరుగుతోందని.. యాపిల్‌ కార్యకలాపాల వృద్ధికి ఇది ఊతమివ్వగలదని కుక్‌ వివరించారు. భారత్, థాయ్‌లాండ్, కొరియా తదితర దేశాల్లో యాపిల్‌ అమ్మకాల వృద్ధి రేటు 20 శాతం పైగా నమోదైంది. ఏప్రిల్‌ 1తో ముగిసిన రెండో త్రైమాసికంలో యాపిల్‌ ఆదాయం 50.6 బిలియన్‌ డాలర్ల నుంచి 52.9 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ అమ్మకాల వాటా 65 శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు