తొలిసారి ఐఫోన్ ఢమాల్!

27 Apr, 2016 09:07 IST|Sakshi
తొలిసారి ఐఫోన్ ఢమాల్!

న్యూయార్క్: ప్రతిష్టాత్మక యాపిల్ సంస్థ తీవ్ర పరాభావాన్ని ఎదుర్కోంటోంది. ఐఫోన్ అమ్మకాల విషయంలో గత వైభవాన్ని తెచ్చుకునేందుకు ఆ సంస్థ ఎంత ప్రయత్నించినప్పటికీ చతికిల పడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా అనూహ్యంగా ఐఫోన్ అమ్మకాలు పడిపోయాయి. గత 13 ఏళ్లలో ఈ ఏడాదే అతి తక్కువ ఐఫోన్ అమ్మకాలు జరిపినట్లు సంస్థ ప్రకటించింది. ఆపిల్ సంస్థకు ప్రతిష్టాత్మక మార్కెట్లు అమెరికా, చైనా కాగా.. ప్రస్తుతం చైనాలో 25శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని, త్వరలో మరో 25శాతం కూడా తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

గత ఫిబ్రవరితో నుంచి ఇప్పటి వరకు ఆపిల్ షేర్లు కూడా 8శాతం తగ్గిపోయినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అల్ఫాబెట్, ట్విట్టర్ వంటి వాటితో పోల్చినప్పుడు త్రైమాషిక ఫలితాల్లో ఆపిల్ సంస్థవి తగ్గిపోయినట్లు సమాచారం. ఈ ఏడాది తొలి త్రైమాషికంలో 61.2 మిలియన్ల ఐఫోన్ల అమ్మకాలు జరపగా.. రెండో త్రైమాషికంలో వాటి అమ్మకాలు 51.2మిలియన్లకు పడిపోయాయని, అయితే, నిపుణులు మాత్రం 50 మిలియన్ల ఐఫోన్ అమ్మకాలు జరపొచ్చని అంచనావేశారు.

'ఆపిల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్ముందు రాని, ఇంతకుముందు లేని ఒక కొత్త ఆవిష్కరణతో, ఉత్పత్తితో తప్పక ముందు రావాలి. ఇప్పుడు సరిచేసుకుంటున్న చిన్నచిన్న మార్పులతో అమ్మకాలు పెంచలేరు. కొత్త ఉత్పత్తి మాత్రమే ఐఫోన్ అమ్మకాల జోరును పెంచడానికి సరైన మార్గం' అని కన్లుమినో అనే సంస్థకు చెందిన అధ్యయనకారుడు నెయిల్ సాండర్స్ తెలిపారు.

>
మరిన్ని వార్తలు