ట్యాబ్లెట్స్‌కి స్మార్ట్‌ఫోన్ల దెబ్బ

3 May, 2014 04:25 IST|Sakshi
ట్యాబ్లెట్స్‌కి స్మార్ట్‌ఫోన్ల దెబ్బ

న్యూఢిల్లీ: పెద్ద స్క్రీన్లతో వస్తున్న స్మార్ట్‌ఫోన్లు (ఫాబ్లెట్స్) .. ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో జనవరి-మార్చి త్రైమాసికంలో అంతర్జాతీయంగా ట్యాబ్లెట్లు, టూ ఇన్ వన్‌ల అమ్మకాలు 3.9 శాతం మాత్రమే పెరిగాయి. 5.04 కోట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రీసెర్చ్ సంస్థ ఐడీసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం క్రితం త్రైమాసికంతో పోలిస్తే ట్యాబ్లెట్లు, టూ ఇన్ వన్‌ల (డిటాచబుల్ కీబోర్డులతో కూడిన ట్యాబ్లెట్స్) విక్రయాలు 35.7 శాతం క్షీణించాయి. 2013 క్యూ1తో పోలిస్తే 3.9 శాతం మాత్రమే పెరిగాయి. అప్పట్లో ట్యాబ్లెట్స్ అమ్మకాలు 4.86 కోట్లు.

ఆపరేటింగ్ సిస్టమ్‌లు, స్క్రీన్ సైజులు అంటూ తేడా లేకుండా అన్ని విభాగాల్లోనూ విక్రయాలు మందగించాయని, రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని ఐడీసీ తెలిపింది. యాపిల్, అసూస్, అమెజాన్ వంటి కంపెనీల అమ్మకాలు సైతం గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొంది. ఫ్యాబ్లెట్లు 5-7 అంగుళాల స్క్రీన్‌తో ఉంటున్నాయి. పెద్ద స్క్రీన్ ఫోన్ల అమ్మకాలు పెరుగుతుండటం, ఇప్పటికే ట్యాబ్లెట్స్ తీసుకున్న వారు మళ్లీ కొత్తవి తీసుకోకుండా పాతవాటితోనే సర్దుకుపోతుండటం కూడా ట్యాబ్లెట్ల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయని ఐడీసీ ప్రోగ్రామ్ వైస్ ప్రెసిడెంట్ (డివెజైస్ అండ్ డిస్‌ప్లేస్) టామ్ మైనెలి తెలిపారు.

 మిగతా కంపెనీలతో పోలిస్తే యాపిల్ అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ.. కంపెనీ ట్యాబ్లెట్ల అమ్మకాలు 1.95 కోట్ల నుంచి 1.64 కోట్లకు తగ్గిపోయాయి. మార్కెట్ వాటా కూడా 40.2 శాతం నుంచి 32.5 శాతానికి పడిపోయింది. మరోవైపు, శాంసంగ్ మాత్రం తన వాటాను 17.5% నుంచి 22.3%కి పెంచుకోగలిగింది. అమ్మకాలు 85 లక్షల నుంచి 1.12 కోట్లకు పెరిగాయి. దాదాపు మూడింట రెండొంతల వాటాతో ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఆండ్రాయిడ్ ఆధిపత్యం కొనసాగుతుండగా, విండోస్ డివైజ్‌లు కూడా పుంజుకుంటున్నాయని ఐడీసీ రీసెర్చ్ అనలిస్ట్ జితేష్ ఉబ్రాని తెలిపారు.

మరిన్ని వార్తలు