తగిన స్థాయిలోనే మారక నిల్వలు: జైట్లీ 

16 Aug, 2018 00:52 IST|Sakshi

న్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకం విలువ తాజాగా జీవితకాల కనిష్టస్థాయికి పడిపోయినప్పటికీ.. భారత్‌ వద్ద ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన స్థాయిలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ వివరించారు. టర్కీ ఆర్థిక సంక్షోభం కారణంగా ఫారెక్స్‌ మార్కెట్‌లో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఇప్పుడున్నటువంటి నిల్వలతో సమర్థవంతంగా ఎదుర్కునే సత్తా భారత్‌కు ఉందని వ్యాఖ్యానించారు.  కరెన్సీ మార్కెట్‌ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నట్లు తెలిపారు.  

403 బిలియన్‌ డాలర్లకు నిల్వలు 
రూపాయి మారకం విలువ 71 స్థాయికి క్షీణించడంతో కొన్నాళ్ల కిందటే గరిష్టస్థాయిలను నమోదుచేసిన మారక నిల్వలు నెమ్మదిగా కరిగిపోతున్నాయి. కేంద్ర బ్యాంక్‌ సమాచారం ప్రకారం ఆగస్టు 3 నాటికి ఫారెక్స్‌ నిల్వలు 403 బిలియన్‌ డాలర్లుగా నిలిచాయి. అంతక్రితం వారం నాటి నిల్వలతో పోల్చితే 1.49 బిలియన్‌ డాలర్ల మేర తగ్గిపోయాయి. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే డాలరుతో రూపాయి విలువ 6.7 శాతం క్షీణించింది.    

మరిన్ని వార్తలు