వాహన రంగానికి పంక్చర్‌..! 

3 May, 2019 00:43 IST|Sakshi

వరుసగా 10వ నెలలోనూ తగ్గిన విక్రయాలు

న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తోంది. అనుకున్న స్థాయిలో అమ్మకాలు లేక విలవిల్లాడుతోంది. విక్రయాల డేటాను చూసి.. ఈ రంగంలోని మార్కెట్‌ లీడర్లు సైతం కంగుతింటోన్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్‌తో కలుపుకుని వరుసగా 10వ నెల్లోనూ వాహన విక్రయాలు తగ్గుదలనే నమోదుచేశాయి. భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్‌లో టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహన (పీవీ) అమ్మకాలు 26%,  మహీంద్రా అండ్‌ మహీంద్ర పీవీ సేల్స్‌ 9% పడిపోయాయి. ఇక మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు 18.7%, ట్రాక్టర్ల విభాగంలో ఎస్కార్ట్స్‌ 15 శాతం, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సేల్స్‌ 17% తగ్గిపోయిన విషయం ఇప్పటికే వెల్లడయింది.

ఈ అంశంపై మాట్లాడిన టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీఖ్‌.. ‘వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనపడిందనే విషయం డిమాండ్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ ప్రభావం మా సంస్థ అమ్మకాలపై కనిపించింది’ అన్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా ఏప్రిల్‌లో కొనుగోళ్లు నెమ్మదించాయని మహీంద్రా ప్రెసిడెంట్‌ ఆటోమోటివ్‌ విభాగ  రాజన్‌ వాదేరా చెప్పారు. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్య, అధిక భీమా, పెరిగిన వ్యయాలు ఈ రంగానికి పెనుసవాళ్లుగా నిలవగా.. బీఎస్‌ సిక్స్‌ ఉద్గార నిబంధనల అమలు అన్నింటి కంటే అతిపెద్ద సవాలుగా మారిందని పరిశ్రమ వర్గాలు విశ్లేషించాయి.

మరిన్ని వార్తలు