తగ్గిన టోకు ద్రవ్యోల్బణం

16 May, 2014 00:24 IST|Sakshi
తగ్గిన టోకు ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 5.2 శాతంగా నమోదయ్యింది. అంటే వార్షిక ప్రాతిపదికన 2013 ఏప్రిల్‌తో పోల్చితే ఈ రేటు 2014 ఏప్రిల్‌లో 5.2 శాతం పెరిగిందన్నమాట. 2014 మార్చిలో ఈ పరిమాణం 5.7 శాతం. నెలలో అరశాతం తగ్గింది. ఆహార ధరలు తగ్గడం మొత్తం టోకు  ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపింది. డబ్ల్యూపీఐలో ఒక భాగంగా ఉన్న ఆహార ధరల రేటు వార్షికంగా మార్చిలో 9.9% వద్ద ఉంటే, ఏప్రిల్‌లో ఇది 8.64%. పప్పు దినుసులు, ఉల్లిపాయల రేట్లు వార్షికంగా తగ్గాయి.

 ధరల తీరిది...: వార్షిక ప్రాతిపదికన 2013 ఏప్రిల్‌తో చూస్తే, 2014 ఏప్రిల్‌లో పప్పు దినుసులు (మైనస్ 0.77 శాతం) ఉల్లిపాయల (మైనస్ 9.76%) రేట్లు తగ్గాయి. మిగిలిన రేట్ల విషయానికివస్తే తృణధాన్యాల ధరలు 8.31 శాతం, బియ్యం ధరలు 12.76 శాతం, కూరగాయల ధరలు 1.34 శాతం, ఆలూ ధరలు భారీగా 31.56 శాతం, పండ్ల ధరలు 16.46 శాతం, పాల ధరలు 9.19 శాతం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 9.97 శాతం పెరిగాయి.
 
రేటు తగ్గింపుపై ఊహాగానాలు!
 కాగా టోకు ద్రవ్యోల్బణం తగ్గిన దృష్ట్యా ప్రత్యేకించి టోకున ఆహార పదార్థాల ధరల రేటు నెలవారీగా తగ్గినందున, రానున్న ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ పాలసీ రేటు రెపోను తగ్గించే అవకాశం ఉందని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 3న ఆర్‌బీఐ పాలసీ సమీక్ష జరపనుంది. ధరలకు సంబంధించి తాజా ధోరణి ఇకముందూ కొనసాగే అవకాశం ఉందని ఫైనాన్స్ సెక్రటరీ అరవింద్ మయారామ్ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం 8.59%గా నమోదైంది.

మరిన్ని వార్తలు