రూ.15 లక్షల స్కూటర్ తెస్తాం!

21 May, 2016 01:52 IST|Sakshi
రూ.15 లక్షల స్కూటర్ తెస్తాం!

పియాజియో వెహికల్స్ ఎండీ స్టెఫానో పెలె
త్వరలో మార్కెట్లోకి వెస్పా 946 ఎంపోరియం
ఈ ఏడాది మరిన్ని నూతన మోడళ్లు ప్రవేశపెడతాం...

పియాజియో.. ప్రీమియం ద్విచక్ర వాహనాల తయారీలో ఉన్న ఈ ఇటాలియన్ కంపెనీ భారత మార్కెట్‌లో దూసుకెళ్తోంది. రెండేళ్లుగా డీలర్‌షిప్ కేంద్రాలను పెంచడమేగాక మార్కెట్ పరంగా ఉనికిని చాటుకుంటోంది. తయారీ కేంద్రం సామర్థ్యాన్ని పెంచుతోంది. 18-28 ఏళ్ల యువ కస్టమర్లు లక్ష్యంగా వెస్పా ఫ్లాగ్‌షిప్ మోడల్‌తో స్కూటర్ల విపణిలో తనకంటూ ప్రత్యేకతను సాధించింది. 125 సీసీ స్కూటర్లతో భారత్‌లో 2012లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. మార్కెట్ తీరుకు అనుగుణంగా ఇప్పుడు 150 సీసీ సామర్థ్యమున్న మోడళ్లను విస్తృతం చేస్తున్నట్టు పియాజియో వెహికల్స్ ఎండీ స్టెఫానో పెలె తెలిపారు. ప్రతి మోడల్ ఒక కొత్త విభాగాన్ని సృష్టిస్తుందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. విశేషాలివీ..

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :
భారత్‌లో వేగం పెంచినట్టు ఉన్నారు..
అవును. రెండేళ్లుగా బ్రాండ్ ఉనికిని పెంచాం. ఈ ఏడాది మరింత విస్తరిస్తున్నాం. చిన్న పట్టణాల్లోనూ వినియోగదారులు వెస్పా స్కూటర్లు కొంటున్నారు. పుణేకు 200 కిలోమీటర్ల దూరంలో ఓ మారుమూల పల్లెలో వెస్పా పరుగు తీయడం కంటపడింది. స్కూటర్ యజమానితో మాట్లాడాను. వాహనం గురించి అడిగాను. తనకు బాగా నచ్చిందన్నది ఆయన సమాధానం. ఇదే మాకు స్ఫూర్తి కలిగిస్తోంది. పల్లెల్లోనూ మాకు కస్టమర్లున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 90 డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. డిసెంబర్‌కల్లా మరో 25 రానున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నాం. 2016లో విస్తరణతో ఈ నగరాల్లోని ఔట్‌లెట్ల సంఖ్య 20 శాతానికి చేరుతుంది.

 ఏ లక్ష్యంతో ఇక్కడ అడుగుపెట్టారు?
స్కూటర్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే మా ఫోకస్ అంతా ప్రీమియం స్కూటర్లపైనే. దేశంలో బైక్‌ల కంటే వీటి వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. తొలుత 125 సీసీ మోడళ్లను ప్రవేశపెట్టాం. ఇప్పుడు దేశంలో 150 సీసీ మోడళ్లు పాపులర్ అవుతున్నాయి. దీంతో ఈ శ్రేణిని పెంచుతున్నాం. 100 రకాల వాహనాలున్నా వెస్పా తన ఉనికిని చాటుకుంటోంది. ఆ స్థాయిలో డిజైన్‌తో ప్రవేశపెట్టాం. రంగులూ ఆకట్టుకునే రీతిలో ఎంపిక చేశాం. ప్రతి మోడల్ మార్కెట్లో ఒక నూతన విభాగాన్ని సృష్టించాలన్నదే మా లక్ష్యం. ఇప్పటి వరకు వచ్చిన మోడళ్లు దీనిని నిరూపించాయి కూడా.

 ఆటో షోలలో పలు మోడళ్లను ప్రదర్శించారు. భారత్‌కు వేటిని తీసుకొస్తున్నారు?
స్పోర్టీ, స్టైలిష్ స్కూటర్ అప్రీలియా ఎస్‌ఆర్ 150 ఆగస్టుకల్లా రోడ్డెక్కనుంది. స్కూటర్‌లాంటి సౌకర్యం, బైక్‌లాంటి పవర్‌తో ఇది వస్తోంది. కొత్త విభాగాన్ని క్రియేట్ చేయడం ఖాయం. మోటో గుజ్జి బ్రాండ్‌లో రోమర్, బాబర్ బైక్‌లను మూడో త్రైమాసికంలో ప్రవేశపెడుతున్నాం. వెస్పా 300 జీటీఎస్ స్కూటర్, వెస్పా 946 ఎంపోరియో అర్మాణీ స్కూటర్ ఈ ఏడాదే రానున్నాయి. భారత్‌లో 946 మోడల్ ధర ఇంకా నిర్ణయించలేదు. రూ.12లక్షలు-15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. విభిన్న కాన్సెప్ట్స్‌తో ఈ స్కూటర్‌ను రూపొందించాం. పియాజియో మెడ్లీ 150, పియాజియో లిబర్టీ 125 స్కూటర్లు ప్రస్తుతానికి విదేశీ మార్కెట్లలోనే విక్రయిస్తాం. ఆ తర్వాత భారత్‌కు పరిచయం చేయాలని ఉంది.

మరి కొత్త మోడళ్ల రాకతో తయారీ సామర్థ్యం పెంచాల్సి వస్తుందా?
అమ్మకాల్లో విలువ పరంగా రెండింతల వృద్ధి నమోదు చేశాం. మహారాష్ట్రలోని తారామతి వద్ద ఉన్న ప్లాంటు వార్షిక సామర్థ్యం 1,00,000 యూనిట్లు. కొత్త మోడళ్లు పరుగు తీయనుండడంతో వచ్చే ఏడాది సామర్థ్యం పెంచాల్సి వస్తుంది. నేపాల్, మాల్దీవులకు ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తున్నాం. దక్షిణాసియా దేశాలు, లాటిన్ అమెరికా మార్కెట్లకు ఎగుమతులను కొద్ది రోజుల్లో మొదలు పెడతాం.

హైదరాబాద్ మార్కెట్ గురించి కాస్త వివరించండి?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వెస్పా స్కూటర్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. కంపెనీకి భారత్‌లో టాప్-5 నగరాల్లో భాగ్యనగరి నిలిచింది. అందుకే మోటోప్లెక్స్ ఔట్‌లెట్‌ను ఇక్కడ ప్రారంభించాం. పియాజియోకు చెం దిన ప్రీమియం ఇటాలియన్ బ్రాండ్స్ అయిన అప్రీలియా, మోటో గుజ్జి, వెస్పా బ్రాండ్ ద్విచక్ర వాహనాలన్నింటికీ వన్ స్టాప్ స్టోర్‌గా మోటోప్లెక్స్ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో పుణే తర్వాత ఈ స్టోర్ ఉన్నది హైదరాబాద్‌లోనే. ప్రపంచ వ్యాప్తంగా 1946 నుంచి ఇప్పటి వరకు 1.80 కోట్ల వెస్పా స్కూటర్లు అమ్ముడయ్యాయి.

మరిన్ని వార్తలు