భారత్‌లో ఆరామ్‌కో అరంగేట్రం

12 Apr, 2018 00:44 IST|Sakshi

రత్నగిరి రిఫైనరీ  ప్రాజెక్ట్‌లో 50 శాతం వాటా  

ఈ ప్రాజెక్ట్‌కు సగం ముడి చమురు సరఫరా చేస్తాం 

సౌదీ ఇంధన మంత్రి హామీ  

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఉత్పత్తి సంస్థ, సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజ కంపెనీ,  సౌదీ ఆరామ్‌కో భారత్‌లోని భారీ ఇంధన ప్రాజెక్ట్‌లో భాగస్వామి కాబోతోంది. అంతేకాకుండా భారత ఇంధన రిటైల్‌ రంగంలోకి కూడా ప్రవేశించనున్నది.   మహారాష్ట్రలోని రత్నగిరిలో ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ను నిర్మించే కన్సార్షియమ్‌లో సౌదీ ఆరామ్‌కో భాగస్వామి కానున్నది. ఈ రత్నగిరి రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఆర్‌పీసీఎల్‌)ను 4,400 కోట్ల డాలర్లతో నిర్మించనున్నారు. ఈ రిఫైనరీ రోజుకు 1.2 మిలియన్‌ బ్యారెళ్ల చమురును ప్రాసెస్‌ చేస్తుంది. ఏడాదికి 18 మిలియన్‌ టన్నుల పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను అందించనున్నది. ఈ కన్సార్షియమ్‌లో సౌదీ ఆరామ్‌కో కంపెనీకి 50 శాతం వాటా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొ, హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కంపెనీ, భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొలకు కలపి 50 శాతం చొప్పున వాటాలుంటాయి. భారత కంపెనీల 50 శాతం వాటాలో ఐఓసీకి సగం, మిగిలిన సగం మిగిలిన రెండు కంపెనీలకు ఉంటాయి. ఈ మేరకు ఈ కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.  ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌తో కుదిరిన ఈ ఒప్పందంపై  సౌదీ అరేబియా ఇంధన మంత్రి ఖలీద్‌ అల్‌– ఫలిహ్‌ సంతకాలు చేశారు. ఇక్కడ జరిగిన 16వ ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఫోరమ్‌ మినిస్టీరియల్‌ సమావేశంలో  పాల్గొన్న ఆయన  ఈ రిఫైనరీలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఈ రిఫైనరీకి అవసరమైన దాంట్లో సగం వరకూ ముడి చమురును కూడా సరఫరా చేస్తామని చెప్పారు.  
2025 కల్లా పూర్తి  

60 మిలియన్‌ టన్నుల ఈ రిఫైనరీ 2025 కల్లా పూర్తవుతుందని అంచనా. కాగా అబూ దాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీని కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా చేయాలని ఆరామ్‌కో యోచిస్తోంది. తమ పెట్టుబడులకు ప్రాధాన్యత దేశంగా భారత్‌ను పరిగణిస్తున్నామని  ఖలీద్‌ పేర్కొన్నారు.  తమ కంపెనీకి క్రెడిట్‌ రేటింగ్‌ అధికంగా ఉందని, దీంతో ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన రుణాలు తక్కువ వడ్డీరేట్లకే లభించే అవకాశాలున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రత్నగిరిలోని బాబుల్‌వాడిలో 14,000 ఎకరాల్లో ప్రధాన కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. 

భాగస్వామ్యం దాకా పురోగతి... 
భారత్, సౌదీ అరేబియాల మధ్య కొనుగోలుదారు, అమ్మకందారులుగా ఉన్న సంబంధం వ్యూహాత్మక భాగస్వామ్యం దాకా పురోగతి సాధించిందని భారత పెట్రోలియమ్‌ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ సందర్భంగా చెప్పారు. భారత ఇంధన రిటైల్‌ రంగంలోకి ప్రవేశించాలన్న ఆసక్తిని సౌదీ ఆరామ్‌కో వ్యక్తం చేసిందని, ఈ మేరకు నియమ నిబంధనలను సమీక్షిస్తామని పేర్కొన్నారు. అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో అత్యధికంగా చమురు వినియోగిస్తున్న దేశం మనదే.   

మరిన్ని వార్తలు