గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌

17 Aug, 2017 20:55 IST|Sakshi
గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌
మీరు గృహ కొనుగోలుదారులా? మీ గృహం కోసం బిల్డర్ కు లేదా ఫ్లాట్ ఓనర్ కు ఒప్పందం మేరకు డబ్బు చెల్లించినప్పటికీ మీకు ఫ్లాట్ స్వాధీనం చేయడం లేదా? ఒప్పందం ప్రకారం అలా ఫ్లాట్ స్వాధీన పరచని పక్షంలో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారా? ఒకవేళ బిల్డర్ లేదా నిర్మాణ సంస్థ దివాలా తీసినట్టు ప్రకటిస్తే, లేదా నిధులు లేవన్న కారణంగా నిర్మాణాలను వాయిదా వేస్తూ వెళుతున్నప్పుడు ఏం చేయాలి? అలాంటి వారికి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది.
 
ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు కేవలం బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు మాత్రమే అస్త్రాలుగా వాడుతున్న ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్ట్సీ కోడ్‌ (ఐబీసీ) ఇకనుంచి వినియోగదారులు కూడా ఉపయోగించేలా చట్టంలో సంబంధిత నిబంధనల్లో మార్పులు చేశారు. అంటే ఒప్పందం మేరకు ఫ్లాట్ స్వాధీనపరచనప్పుడు ఈ చట్టం ప్రకారం వినియోగదారులు బిల్డర్ నుంచి క్లెయిమ్ పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా నిబంధనల మేరకు బిల్డర్ లేదా కంపెనీ ఏదేనీ కారణం చూపిస్తూ ఫ్లాట్ ను స్వాధీనం చేయనప్పుడు తాజా చట్టం మేరకు క్లెయిమ్ కోరవచ్చు. ప్రస్తుతం ఇలాంటి సమస్యలు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయి.
  
ఫండ్స్‌ లేవని సాకుచూపుతూ చాలామంది డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు డెలివరీలు ఇవ్వకుండా నాన్చుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు గడువు మించి మరింత కాలం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇటు రీఫండ్‌ కోసం కూడా కొనుగోలుదారులు వేచిచూడాల్సి వస్తోంది. చట్టంలో చేర్చిన కొత్త నిబంధనల మేరకు క్లెయిమ్ కోసం ప్రత్యేకంగా ఒక దరఖాస్తును సమర్పించాలి. కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రెజుల్యూషన్‌ ప్రాసెస్‌ కింద ఈ దరఖాస్తును అందించాలి. అలా సమర్పించిన దరఖాస్తును నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), దివాలా చట్టం కింద కేసును అంగీకరిస్తే, మిగతా ప్రక్రియ ముందుకు సాగడానికి తాత్కాలిక పరిష్కార ప్రొఫెషనల్‌ను నియమిస్తారు. ఇలా దివాలా చట్టం కింద దివాలా కార్పొరేట్‌ సంస్థ నుంచి గృహ వినియోగదారులు తమ రీఫండ్‌ను పొందవచ్చు.

 

మరిన్ని వార్తలు