దేశంలో పదేళ్లలో 17 శాతం ఐటీ పెట్టుబడుల వృద్ధి

17 Aug, 2016 01:01 IST|Sakshi
దేశంలో పదేళ్లలో 17 శాతం ఐటీ పెట్టుబడుల వృద్ధి

రూ.53,396 కోట్లతో కర్ణాటక టాప్
ఏపీ వాటా 12 శాతం; తెలంగాణ వాటా 4 శాతం
రూ.46,200 కోట్ల నుంచి రూ.2.2 లక్షల కోట్లకు!


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశంలో 2005-06లో ఐటీ పెట్టుబడులు రూ.46,200 కోట్లుగా ఉంటే.. 2015-16 నాటికది రూ.2.2. లక్షల కోట్లకు పెరిగింది. పదేళ్లలో 17% వృద్ధిని నమోదు చేసింది. అయితే నాలుగో వంతు పెట్టుబడులు కర్ణాటక రాష్ట్రమే ఆకర్షించిందని అసోచాం నివేదికలో వెల్లడైంది. 2005-06లో రూ.14,337 పెట్టుబడులను ఆకర్షించిన కర్ణాటక.. 14% వృద్ధి రేటుతో 2015-16 నాటికి రూ.53,396 కోట్లకు చేరింది. 48% వృద్ధి రేటుతో రూ.35,300 కోట్ల పెట్టుబడులతో గుజరాత్ 2వ స్థానంలో నిలిచింది. 2005-06లో ఈ పెట్టుబడులు రూ.700 కోట్లు.

2015-16లో రాష్ట్రాల వాటాలను పరిశీలిస్తే.. కేరళ 13%, ఆంధ్రప్రదేశ్ 12%, తమిళనాడు 7%, హరియాణా 5%, మహా రాష్ట్ర 5%, వెస్ట్ బెంగాల్ 4.5%, తెలంగాణ 4%, ఒడిశా 3%, ఉత్తర్ ప్రదేశ్ 2%, మధ్యప్రదేశ్ 1.5% పెట్టుబడులను ఆకర్షించాయని అసోచాం నివేదిక వెల్లడించింది. ‘‘రొబోటిక్స్, సెమీ కండక్టర్ చిప్ డిజైన్, నానో టెక్నాలజీ వంటి విభాగాల్లో కర్నాటక హబ్‌గా మారింది. మెరుగైన పరిపాలన, లా అండ్ ఆర్డర్, పన్ను రాయితీల వంటివి ఐటీ కంపెనీలు కర్నాటక వైపు మొగ్గు చూపడానికి కారణమని’’ అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ చెప్పారు. మానవ వనరుల సమృద్ధి, ఐటీ నిపుణులు, ప్రతిభావంతులు, నైపుణ్యమైన ఉద్యోగులు, స్నేహపూరిత విధానాలూ కలిసొస్తున్నాయన్నారు.

మరిన్ని వార్తలు