మధ్యతరగతికి గతంలో చాలా ఇచ్చాం!

3 Feb, 2018 00:28 IST|Sakshi

వీలును బట్టి ఇకపైనా ఊరటనిచ్చే చర్యలు

బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ: తాజా ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా ప్రత్యేక ప్రతిపాదనలేమీ చేయకపోవడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమర్ధించుకున్నారు. గత బడ్జెట్‌లో మధ్యతరగతి వర్గాలకు చాలానే చేశామని వ్యాఖ్యానించారు. వెసులుబాటును బట్టి భవిష్యత్‌లోనూ మరికొన్ని ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ‘భారత్‌లో చట్టాలను అమలు చేయడంలో చాలా సవాళ్లున్నాయి.

అలాగే పన్నులు చెల్లించే వారి సంఖ్యను పెంచే విషయంలోనూ పెద్ద సవాళ్లే ఉన్నాయి. నేను ప్రవేశపెట్టిన నాలుగైదు బడ్జెట్‌లను పరిశీలిస్తే.. పద్ధతిప్రకారం చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులకు ప్రతీ బడ్జెట్‌లోనూ ఎంతో కొంత ఊరట కల్పిస్తూనే ఉన్నాను‘ అని ఓపెన్‌ మ్యాగజైన్‌ నిర్వహించిన బడ్జెట్‌ అనంతర చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షల నుంచి పెంచామని, అదనంగా పొదుపునకు సంబంధించి మినహాయింపు పరిమితిని మరో రూ. 50,000 పెంచి మొత్తం రూ. 1.5 లక్షలకు చేర్చామని, గృహ రుణాల రీపేమెంట్స్‌పై పరిమితిని కూడా ఏడాదికి రూ. 2 లక్షలకు పెంచామని జైట్లీ చెప్పారు.

ఇక రూ. 50 లక్షల దాకా ఆదాయం ఉన్న డాక్టర్లు, లాయర్లు మొదలైన వృత్తి నిపుణులకు ట్యాక్సేషన్‌ను సరళతరం చేశామన్నారు. రూ. 5 లక్షల దాకా వార్షికాదాయం ఉన్న వారిపై పన్ను శాతాన్ని పది నుంచి అయిదు శాతానికి తగ్గించామని జైట్లీ వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన, సరిహద్దుల రక్షణ, సామాజిక సంక్షేమ పథకాలు మొదలైన వాటన్నింటి కోసం నిధులు సమకూర్చుకోవడం తప్పనిసరి అని ఆయన చెప్పారు. ఇందుకోసం తక్కువ మొత్తంలోనైనా పన్నులు కట్టేలా పెద్ద సంఖ్యలో ప్రజలను పన్ను పరిధిలోకి తేవడం ద్వారా దేశ ప్రయోజనాలను పరిరక్షించగలమన్నారు.  

చమురు రేట్లు ఆందోళనకరమే అయినా..
ముడిచమురు ధరల పెరుగుదల ఆందోళన కలిగించేదే అయినా, పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని జైట్లీ చెప్పారు. అధిక ద్రవ్యోల్బణ జమానా నుంచి భారత్‌ బైటపడ్డట్లేనని ఆయన తెలిపారు. రెండు శాతం అటూ ఇటూగా నాలుగు శాతం ద్రవ్యోల్బణ గణాంకాల లక్ష్యం సహేతుకమైనదేనని, సాధించగలిగే లక్ష్యమేనని జైట్లీ పేర్కొన్నారు.

కూరగాయలు, ముడిచమురు ధరల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు తదితర అంశాలు ఇటీవలి ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత తగిన సమయంలో తగు నిర్ణయం తీసుకోగలమని జైట్లీ చెప్పారు.   


నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రయోజనం!
స్టాండర్డ్‌ డిడక్షన్‌పై హస్‌ముఖ్‌ ఆదియా 
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌లో ప్రతిపాదిన రూ.40,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రయోజనం కలిగిస్తుందని ఆర్థిక శాఖ కార్యదర్శి హస్‌ముఖ్‌ ఆదియా పేర్కొన్నారు. పన్ను రహిత ఆదాయాన్ని ఉద్యోగ వర్గాలు, పెన్షనర్లు రూ.2.9 లక్షల వరకూ పెంచుకునే వెలుసుబాటు దీనివల్ల కలుగుతోందన్నారు.

నిజాయితీగా పన్ను చెల్లించే వేతన వర్గం ప్రధాన లక్ష్యంగా ఆర్థికమంత్రి ఈ ప్రయోజనాన్ని బడ్జెట్‌లో పొందిపరిచారని అన్నారు. కాగా స్టాండర్డ్‌ డిడక్షన్‌ నేపథ్యంలో ప్రస్తుతం మినహాయింపు పరిధిలో ఉన్న రవాణా, వైద్య చికిత్స అలవెన్సులను పన్ను పరిధిలోకి తేవడంతో కొంత నిరాశ వ్యక్తమయిన సంగతి తెలిసిందే.  

ప్రైవేటు పెట్టుబడులు పెంచే చర్యల్లేవ్‌...
ద్రవ్యలోటు లక్ష్యాల పెంపు పట్ల భారత ప్రముఖ ఆర్థికవేత్త,, కార్నెల్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ (వాణిజ్య విధానం) ఈశ్వర ప్రసాద్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ద్రవ్య క్రమశిక్షణ కట్టుతప్పినట్లేనని పేర్కొన్నారు. 

అలాగే ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికీ బడ్జెట్‌లో  చర్యలు లేవని విమర్శించారు. అయితే బడ్జెట్‌లో ప్రతిపాదిత ఆరోగ్య బీమా పథకం పేదలకు ప్రయోజనం చేకూర్చుతుందని అన్నారు. కాగా ఇది వృద్ధికి దోహదపడే బడ్జెట్‌ అని అమెరికా ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ నిషా దేశాయ్‌ బిస్‌వాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు