వృద్ధితో ద్రవ్యలోటు కట్టడి: జైట్లీ

9 Jul, 2014 00:45 IST|Sakshi
వృద్ధితో ద్రవ్యలోటు కట్టడి: జైట్లీ

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన తొలి బడ్జెట్ సమర్పణకు రెండు రోజుల ముందు ద్రవ్యలోటుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ద్రవ్యలోటును ఆమోదనీయ స్థాయిలో కట్టడి చేయడం అవసరమని ఉద్ఘాటించిన ఆయన, వృద్ధి, పన్నుల వసూళ్ల ద్వారా ఈ దిశలో ప్రభుత్వం ముందుకు కదులుతుందని అన్నారు. ద్రవ్యలోటు కట్టడికి వ్యయ నియంత్రణలు సరికాదన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వివరించారు.

ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ, ద్రవ్యలోటు గురించి వివరించారు. ద్రవ్యలోటు కట్టడికి ఆర్థిక వృద్ధే కీలకమని అన్నారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  మొదటి రెండు నెలల్లో (2014-15, ఏప్రిల్-మే) ద్రవ్యలోటు రూ.2.4 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఫిబ్రవరి 17న అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల్లో ఇది 45.6 శాతానికి సమానం.

  2014-15లో మొత్తం ద్రవ్యలోటు రూ.5.28 లక్షల కోట్లకు కట్టడి చేయాలని చిదంబరం చివరి ఓటాన్ అకౌంట్ నిర్దేశించుకుంది.  2013-14 జీడీపీతో పోల్చిచూస్తే, ఆ యేడాది ద్రవ్యలోటు 4.5 శాతంగా ఉంది (రూ.5,08,149 కోట్లు). 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమాణం 4.9 శాతం. 2016-17 నాటికి ఆర్థిక వృద్ధి ద్వారా జీడీపీలో ద్రవ్యలోటు శాతాన్ని 3 శాతానికి తగ్గించాలన్నది కేంద్రం లక్ష్యం. 2014-15 జీడీపీలో ద్రవ్యలోటు 4.1 శాతానికి కట్టడి చేయాలన్నది ఫిబ్రవరి 17 బడ్జెట్ లక్ష్యం.

 క్లెయిమ్ చేయని మొత్తం రూ.5వేల కోట్లు: కాగా రాజ్యసభ్యలో ఆర్థికశాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ,  బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని మొత్తం నిధుల పరిమాణం 2013 డిసెంబర్ 31 నాటికి రూ.5,124 కోట్లని తెలిపారు. సంబంధిత డిపాజిటర్ల సమాచారాన్ని తెలుసుకోడానికి బ్యాంకింగ్ వ్యవస్థ తగిన చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా వెల్లడించారు.

 సంస్కరణలే వృద్ధికి బాట: కేంద్రం
 న్యూఢిల్లీ: సంస్కరణలతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఒక ప్రకటనలో కేంద్రప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్ ఆర్థికమంత్రి జార్జ్ ఆస్‌బోర్న్‌తో భారత్ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమావేశం అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది. సంస్కరణల అమలు ద్వారా రానున్న త్రైమాసికాల్లో వృద్ధి జోరందుకుంటున్న అభిప్రాయాన్ని ప్రకటన వ్యక్తం చేసింది. ఇటీవలి ప్రపంచ ఆర్థిక రికవరీ సంకేతాలు భారత్, బ్రిటన్‌లకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు